హైదరాబాద్ నవంబర్ 16 (ఈతరం భారతం );: మాజీ మంత్రి కేటీఆర్‌పై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలు తీవ్ర విమర్శలు గుప్పించారు. లగచర్లపై బీఆర్ఎస్ చేసిన దుర్మార్గపు చర్యలు బయటపడ్డాయని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. కేటీఆర్ తండ్రి చాటు పిలగాడని విమర్శించారు. శనివారం సీఎల్పీ మీడియా సెంటర్‌లో మందుల సామెలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రిని అడ్డుపెట్టుకుని కేటీఆర్ అరాచకం చేశారని ఆరోపించారు. తెలంగాణ రాకముందు మీ ఆస్తులు ఎన్ని అని ప్రశ్నించారు. రాబందుల రాజ్యం కేసీఆర్ కుటుంబానిదేనని విమర్శలు చేశారు. కేసీఆర్ కుటుంబంలో ఉన్న ఆరుగురు రాబందులేనని ఆక్షేపించారు. కలెక్టర్లను మాజీ సీఎం కేసీఆర్ బానిసలుగా చేశారని ధ్వజమెత్తారు. ఐఏఎస్‌లతో కాళ్లు మొక్కించుకోవడం, దాడి చేయడం బీఆర్ఎస్ నాయకుల పని అని మందుల సామెలు ఆరోపించారు.‘‘కాళ్లు మొక్కిన వారిని కేసీఆర్ ఎమ్మెల్సీలను చేశారు. నీ జేజమ్మ వచ్చినా మమ్మల్ని ఏం చేయలేరు. ప్రభుత్వానికి కొండంత ప్రజాబలం ఉంది. మమ్మల్ని గోరంత కూడా ఏం చేయలేరు. రేవంత్ ఎక్కడ దోచుకున్నాడో చెప్పండి. తెలంగాణ పేరు మీద బీఆర్ఎస్ నాయకులు లీడర్లు అయ్యారు. రేవంత్ రెడ్డిని ఎవరు దించుతారో రండి. హరీష్‌రావు మేడిగడ్డ దగ్గర చాప వేసుకొని పడుకున్నాడు. బీఆర్ఎస్ తెర చినిగిపోయింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మూసీ దగ్గర పడుకుంటే మంచిది. బీజేపీ నాయకులు మూసీ దగ్గర పడుకుంటా అంటే మేమేమైనా వద్దని అన్నామా.. అడ్డుకుంటున్నామా అని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు మనిషికో గ్లాస్ తీసుకెళ్లి మూసీ నీళ్లను తాగాలి’’ అని మందుల సామెలు ఎద్దేవా చేశారు.