Eetaram Bharatam ఈతరం భారతమ్
Search

ఢిల్లీలో వాయు కాలుష్యం…దేశ రాజదానిగా హైదరాబాద్!

హైదరాబాద్ నవంబర్ 21 (ఈతరం భారతం);: దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ ఉండాలనే చర్చ అప్పుడప్పుడు తెరపైకి రావడం కొత్తేమి కాదు. రెండో రాజధానిగా కాకుండా ఈసారి ఏకంగా దేశ రాజధానిగా హైదరాబాద్ ఉండటం అన్ని విధాలుగా యో గ్యదాయకమని తాజాగా మరోసారి చర్చకు వచ్చింది. ఈసారి ఈ చర్చకు కాంగ్రెస్ ఎంపి శశి థరూర్ చేసిన వ్యాఖ్యలు కేంద్ర బింధువు కావడం విశేషం. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య కారకాలు ప్రమాద ఘంటికలు మోగిస్తోన్న నేపథ్యంలో ‘ఢిల్లీ ఇంకా దేశ రాజధానిగా కొనసాగడం అవసరమా?’ అని కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపి శశి థరూర్ తాజాగా ట్వీట్ చేశారు. ‘ప్రపంచంలో రెండవ అత్యంత కలుషిత నగరమైన ఢాకా కంటే ఢిల్లీలో పరిస్థితి ఐదు ఎక్కువ. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారింది. ఇక్కడ ప్రమాదకర కాలుష్య కారకాలు నాలుగు రెట్లు పెరిగాయి. నవంబర్ నుంచి జనవరి మధ్య ఈ నగరం నివాసయోగ్యం కాదు. ఇలాంటి పరిణామాల మధ్య ఢిల్లీని దేశ రాజధానిగా కొనసాగించాలా?’ అని శశి థరూర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలే ప్రస్తుతం నెట్టింట దేశ రాజధానిపై చర్చకు దారితీసింది. ఢిల్లీ కాకుండా దేశ రాజధానిగా ఏది ఉంటే బాగుంటుందన్న చర్చ జోరుగా సాగుతుండగా మెజార్టి నెటిజన్లు హైదరాబాద్ అయితే బాగుంటుందని పలు కారణాలు చూపుతూ మొగ్గు చూపుతున్నారు.

 

హైదరాబాద్ ఎందుకు యోగ్యకరం?

 

దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ ఉండాలన్న చర్చ స్వాతంత్య్రం సిద్ధించిన తొలినాళ్లలోనే వచ్చింది. ఈ ప్రతిపాదనను రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ స్వయంగా తెరపైకి తీసుకవచ్చారు. తన ‘థాట్స్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్’ అనే పుస్తకంలో హైదరాబాద్‌ను రెండో రాజధానిగా చేయాలని అంబేద్కర్ ప్రతిపాదించారు. దీనికి కొన్ని బలమైన కారణాలను కూడా ఆయన చూపారు. భారత దేశానికి శత్రు దేశాలైన పాకిస్తాన్, చైనా సరిహద్దులకు హైదరాబాద్ నగరం సుదూరంగా ఉండటం దేశ భద్రతాపరంగా అనువైన ప్రాంతమని ఆయన పేర్కొన్నారు. అలాగై హైదరాబాద్ నగరం అన్ని సీజన్లకు అనువుగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ అంశం రాష్ట్ర విభజన సందర్భంగా చర్చకు వచ్చింది.

 

హైదరాబాద్‌లో ఎత్తైన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు హాజరైన అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ ఆ సందర్భంగా హైదరాబాద్‌ను రెండో రాజధానిగా అంబేద్కర్ ప్రతిపాదించిన విషయాన్ని ఆయన గుర్తు చేసినప్పుడు కూడా ఈ చర్చ జరిగింది. అనంతరం మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్‌రావు కూడా ఎప్పటికైనా హైదరాబాద్ దేశానికి రెండో రాజధానిగా అవుతుందన్న నమ్మకం తనకు ఉందంటూ ప్రకటన కూడా చేశారు. ఇలా అడపాదడపా హైదరాబాద్‌ను రెండో రాజధానిగా చేయాలన్న చర్చ ఎల్లప్పటికీ లైవ్‌గా కొనసాగుతూనే వస్తోంది. కాంగ్రెస్ నేత శశి థరూర్ ఏకంగా దేశ రాజధానిగా ఢిల్లీని ఇంకా కొనసాగించాలా? అని చర్చకు తెరతీయడం తో ఈసారి హైదరాబాద్ రెండో రాజధానిగా కాకుండా ఏకంగా దేశ రాజధానిగా చేస్తే బాగుంటుందని మెజార్టి నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సుముఖంగా లేని రాజకీయ పార్టీలు

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత పదేండ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎ స్ పార్టీ కానీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, హైదరాబాద్ బేసుడ్ ఎంఐఎం పార్టీ హైదరాబాద్‌ను రెండో రాజధానిగా చేయాలన్న ప్రతిపాదన పట్ల సముఖంగా లేవు. ఒకవేళ అదే జరిగితే హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం అవుతుందని, అప్పుడు హైదరాబాద్ పూర్తిగా కేంద్రం ఆధీనంలోకి వెళ్తుందని, అప్పుడు ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న వంటి ఇబ్బందులే వస్తాయని తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలు జంకుతున్నాయి. కాగా ఈ సారి చర్చకు తెరదీసింది కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ కావడంతో రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

నాగ్‌పూర్, చెన్నై పేర్లు కూడా

ఇలా ఉండగా హైదరాబాద్ కాకుండా దేశ రాజధానిగా నాగ్‌పూర్, చెన్నై, బెంగళూర్‌ను చేయాలని కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఆర్‌ఆర్‌ఎస్‌కు హెడ్ క్వార్టర్ అయిన నాగపూర్‌ను రాజధానిని చేయాలని బీజేపీ అనుకూల నెటిజన్లు సూచిస్తున్నారు. మరి కొందరు చెన్నై అయితే బాగుంటుందని, కొందరు బెంగళూర్ బాగుంటుందని సూచిస్తున్నారు. అయితే చెన్నైకి వరద ముప్పు, బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయని, ఇవేవి లేని హైదరాబాద్ అయితే అన్ని విధాల అనుకూలమని మెజార్టీ నెటిజన్లు మొగ్గు చూపుతున్నారు.

Related News

Select the Topic
Scroll to Top

Web Design, Data Processing, Data Entry in Telugu, English & Hindi,
Flyer Designing for Social Media, Video Flyers, Social Media Postings. WhatsApp: 8919646204