హైదరాబాద్ నవంబర్ 24 (ఈతరం భారతం);: తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఏప్రిల్ 27, 2001 నాడు గులాబీ జెండాను ఎగరవేసిన నాయకులు కేసీఆర్ అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని మలుపు తిప్పి… 60 ఏండ్ల తెలంగాణ ఉద్యమ చరిత్ర పై కేసీఆర్ అనే చెరిగిపోని సంతకం చేసిన మహానాయకులు కేసీఆర్ అని కేటీఆర్ కొనియాడారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.2009, నవంబర్ 29న కేసీఆర్ నిరాహార దీక్ష మహోజ్వల ఉద్యమాన్ని మలుపుతిప్పిన రోజు అని మనందరికి తెలుసు. నవంబర్ 29, 2009 స్వరాష్ట్ర కల సాకారానికి పునాది వేసిన రోజుగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే శుభదినం. 3 కోట్ల తెంగాణ ప్రజలు ముక్త కంఠంతో మా తెలంగాణ మాకు కావాలని నినదించారు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ తెచ్చుడో అని తెగువను ప్రదర్శించిన నాయకుడికి అండగా నిలబడి దేశ రాజకీయ వ్యవస్థను కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కదిలించిన ఒక సందర్భం దీక్షా దివస్. అందర్నీ మెప్పించి ఒప్పించి, దేశ రాజకీయ వ్యవస్థను, రాష్ట్రంలో ఉండే రాజకీయ వ్యవస్థను కులమతాలకు అతీతంగా కలిపింది దీక్షా దివస్ అని కేటీఆర్ గుర్తు చేశారు.నవంబర్ 29న 33 జిల్లా పార్టీ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున దీక్షా దివస్ నిర్వహించబోతున్నాం. కేసీఆర్ నాయకత్వం.. ఉద్యమంలో కానీ, పరిపాలనలో కానీ చెరగని ముద్ర వేసింది. రెండు జాతీయ పార్టీలకు బుద్ది చెప్పే విధంగా కదం తొక్కుతాం. 29న దీక్షా దివస్తో పార్టీ శ్రేణులు కదం తొక్కాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అన్ని జిల్లాలకు సీనియర్ నాయకులను ఇంచార్జిలుగా నియమించాం. ఈ నెల 26న ప్రతి జిల్లాలో ముఖ్య నాయకులు కార్యకర్తలతో సన్నాహాక సమావేశాలు నిర్వహిస్తారు. 29న దీక్షా దివస్ను ఘనంగా నిర్వహించబోతున్నాం. డిసెంబర్ 9న మేడ్చల్ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణతో దీక్షా దివస్ ముగిస్తాం. తెలంగాణ తల్లికి ప్రణమిల్లుతూ ఉత్సవాలు నిర్వహిస్తాం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ పాల్గొంటారని కేటీఆర్ తెలిపారు.