న్యూఢిల్లీ డిసెంబర్ 3 (ఈ తరంభారతం ); : వాయిదాల కారణంగా సభా కార్యకలాపాలకు మరింత అంతరాయం వాటిల్లిన పక్షంలో ఆ సమయం నష్టాన్ని భర్తీ చేయడానికి వారాంతాల్లో తాను సభా కార్యక్రమాలను నిర్వహించవలసి వస్తుందని లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లా మంగళవారం సభ్యులను హెచ్చరించారు. పార్లమెంట్లో వారం రోజులుగా సాగుతున్న ప్రతిష్టంభనను అంతం చేయడానికి ప్రభుత్వం, ప్రతిపక్షాలు సోమవారం ఒక ఒప్పందానికి వచ్చిన విషయం విదితమే. రాజ్యాంగాన్ని ఆమోదించిన 75వ వార్షికోత్సవం సందర్భంగా లోక్‌సభ, రాజ్యసభలలో రాజ్యాంగంపై చర్చకు తేదీలను ప్రకటించడమైంది. రాజ్యాంగంపై దిగువ సభలో ఈ నెల 13, 14 తేదీల్లోను, ఎగువ సభలో 16, 17 తేదీల్లోను చర్చ చేపడతారు.మంగళవారం ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే స్పీకర్ బిర్లా మాట్లాడుతూ.. ‘సభ 14 ఉదయం 11 గంటలకు సమావేశం అవుతుంది. మీరు వాయిదాలు కొనసాగించినట్లయితే వాయిదా పడిన రోజులకు సంబంధించి మీరు శని, ఆదివారాల్లో కూడా సభా కార్యకలాపాలకు హాజరు కావలసి ఉంటుంది’ అని స్పష్టం చేశారు. మంగళవారం ఎటువంటి వాయిదా నోటీసుల వర్తమానాన్నీ తాను అనుమతించలేదని కూడా బిర్లా చెప్పారు. అదానీ వివాదం, ఉత్తర ప్రదేశ్ సంభాల్‌లో ఇటీవలి హింసాకాండ, తదితర సమస్యలపై ప్రతిపక్ష సభ్యుల నిరసనల కారణంగా క్రితం వారం లోక్‌సభ కార్యకలాపాలు తుడిచిపెట్టుకుపోయాయి