రంగారెడ్డి జిల్లా ఏప్రిల్ 14 (ఈతరం భారతం);రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఆడుకుంటుండగా కారు డోర్ లాక్ పడటంతో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతిచెందారు.వివరాల్లోకి వెళ్తే చేవెళ్ల మండలం దామరగిద్దకు చెందిన తన్మయశ్రీ (5), అభినయశ్రీ (4) అక్కాచెల్లెళ్లు. సోమవారం నాడు ఇద్దరు ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారులో ఆడుకుంటుండగా డోర్ లాక్ పడింది. చిన్నారులు కారులో ఇరుక్కుపోయిన విషయాన్ని ఎవరూ గమనించలేదు. దీంతో కారులో నుంచి బయటకు వచ్చేందుకు చాలాసేపటి దాకా ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. ఈ క్రమంలోనే ఊపిరాడక ఇద్దరు చిన్నారులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. కాగా, పిల్లలు కనిపించడం లేదని తల్లిదండ్రులు వెతగ్గా, కారులో విగతజీవులుగా మారిన చిన్నారులు కనిపించారు. కారులో నిర్జీవంగా పడివున్న చిన్నారులను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.