న్యూ డిల్లీ ఏప్రిల్ 14 (ఈతరం భారతం);పంజాబ్ నేషనల్ బ్యాంకు రుణ మోసం కేసులో పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెల్జియం లో అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఆయన అరెస్ట్‌పై కేంద్రం తాజాగా స్పందించింది. చోక్సీ అరెస్ట్ భారత్‌కు పెద్ద విజయం అని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి వ్యాఖ్యానించారు.పేదల సొమ్ము దోచుకుని విదేశాలకు పారిపోయిన వారిని పట్టుకొస్తామని ప్రధాని మోదీ వాగ్దానం చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆ హామీని నెరవేరుస్తున్నట్లు చెప్పారు. ‘విదేశాలకు పారిపోయిన వారిని పట్టుకొస్తామని ప్రధాని మోదీ వాగ్దానం చేశారు. పేదల డబ్బును దోచుకున్న వారు ఆ సొమ్మును తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. దేశంలో చాలా మందిపై చర్యలు తీసుకుంటున్నాం. మెహుల్ చోక్సీని అరెస్టు చేశారు. ఇది భారత్‌కు పెద్ద విజయం’ అని ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్‌ఐతో ఆయన అన్నారు.దేశంలోనే రెండో అతిపెద్ద బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.13,500కోట్ల రుణ మోసం కేసులో మెహుల్ చోక్సీ నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన భార్య ప్రీతి చోక్సీతో కలిసి బెల్జియంలోని ఆంట్వెర్ప్‌లో నివాసం ఉంటున్నారు. ఆయనకు ఆంటిగ్వా-బార్బుడా పౌరసత్వం సైతం ఉంది. చోక్సీని భారత్‌కు రప్పించేందుకు సీబీఐతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే సీబీఐ విజ్ఞప్తి మేరకు ఆయనను శనివారం అరెస్టు చేసినట్లు పలు మీడియా నివేదికలు తెలిపాయి. ముంబయి కోర్టు జారీ చేసిన రెండు అరెస్టు వారెంట్ల ఆధారంగా అరెస్టు చేసినట్లు సమాచారం.
