న్యూఢిల్లీ ఏప్రిల్ 14 (ఈతరం భారతం): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలో కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల గురించి గత కొన్ని రోజులుగా వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ భూములను అన్యాక్రాతం చేయవద్దని విద్యార్థులతో పాటు విపక్షలు, విద్యార్థి సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం మాత్రం ఆ భూములు తమవే అని చెబుతోంది.అయితే ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. బిజెపి ప్రభుత్వం చెత్త నుంచి కూడా పనులు చేయాలని చూస్తుంటే.. కాంగ్రెస్ సర్కారు మాత్రం అడవులను నాశనం చేస్తోందని ఆయన అన్నారు. ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతున్నారని.. అడవులపై బుల్డోజర్లు నడపడంలో తెలంగాణ సర్కారు బిజీగా ఉందని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వం అడవులను కాపాడుతుంటే.. కాంగ్రెస్ సర్కారు అడవులను నాశనం చేస్తోందని మండిపడ్డారు.తెలంగాణతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సర్కారులపై కూడా ప్రధాని తనదైన శైలీలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ప్రజలకు నమ్మక ద్రోహం జరుగుతోందని ఆయన అన్నారు. హిమాచల్‌లో అభివృద్ధికి కుంటుపడిందని.. కర్ణాటక ప్రభుత్వం అవినీతిలో నెంబర్.1లో ఉందని ఎద్దేవా చేశారు. రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ.. బిజెపి ముందుకు వెళ్తోందని ఆయన పేర్కొన్నారు.