హైదరాబాద్ ఏప్రిల్ 27 (ఈతరం భారతం);తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కే రామకృష్ణారావు నియామకమయ్యారు. ఆయనను సీఎస్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శాంతికుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో ఆమె స్థానంలో రామకృష్ణారావును ప్రభుత్వం నియమించింది. రామకృష్ణారావు 1991 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన తెలంగాణ ప్రభుత్వంలోనే ఆర్థిక ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్నారు. 2016 ఫిబ్రవరి నుంచి ఆర్థిక శాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆయన పదవీ కాలం ఈ ఏడాది ఆగస్టుతో ముగియనున్నది.దాదాపు 12 సంవత్సరాల పాటు ఆర్థికశాఖలో కొనసాగుతూ వచ్చిన ఆయన.. 14 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లను తీర్చిదిద్దారు. ఇందులో 12 పూరిస్థాయి.. మరో రెండు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లను తీర్చిదిద్దారు. తొలిసారిగా 2014 నవంబరు 5న పూర్తిస్థాయి బడ్టెట్‌ని ప్రవేశపెట్టారు. 1991 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన కే రామకృష్ణారావు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్‌గా, విద్యాశాఖ కమిషనర్‌గా, ప్రణాళికశాఖ ముఖ్య కార్యదర్శిగా సేవలందించారు. ఐఐటీ కాన్పుర్‌లో బీటెక్, ఐఐటీ ఢిల్లీలో ఎంటెక్, అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీలో ఎంబీఏ చదివారు. 2013-14లో ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన ప్రక్రియలోనూ చురుగ్గా వ్యవహరించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శిగా కొనసాగుతూ రాగా.. తాజాగా ప్రభుత్వం ఆయనను సీఎస్‌గా నియమించింది.
