Eetaram Bharatam ఈతరం భారతమ్
Search
📗Eetaram Bharatam Journal Coming Soon.📕

కర్రెగుట్టల్లో భారీ సొరంగం.. ముమ్మరంగా గాలింపు చర్యలు 

ఛత్తీస్‌గఢ్ ఏప్రిల్ 27 (ఈ తరం భారతం);ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దు కర్రెగుట్టల్లో ఆరోరోజూ భద్రతా దళాల కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టుల కోసం ఇక్కడి అడవుల్లో ముమ్మరంగా గాలింపు చేపడుతున్నారు. బలగాలు కర్రెగుట్టలను అన్నివైపుల నుంచి చుట్టుముట్టాయి. ఈక్రమంలో భద్రతా బలగాలు భారీ సొరంగాన్ని గుర్తించాయి. వెయ్యి మంది తలదాచుకునేందుకు వీలుగా దీని నిర్మాణం ఉంది. లోపల పెద్ద మైదానంతో విశాలంగా ఉన్న సొరంగాన్ని గుర్తించారు. ఇందులో నీటి వసతి, ఇతర సౌకర్యాలు ఉన్నట్లు సమాచారం. కొన్ని నెలల పాటు మావోయిస్టులు ఈ సొరంగంలోనే ఉన్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. కొండల్లో పెద్ద సంఖ్యలో ఉన్న మావోయిస్టులు కూడా డీహైడ్రేషన్‌కు గురయ్యారని, వారి పరిస్థితి విషమంగా మారుతోందని భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. మరోవైపు నిరంతరం జరుగుతున్న ఈ ఆపరేషన్ కారణంగా మావోయిస్టులు ఇప్పుడు ఆహారం కోసం ఇబ్బందులు పడుతూ ఉండొచ్చని చెబుతున్నారు.మావోయిస్టులు ప్రస్తుతం దాక్కున్న అన్ని కొండలను చుట్టుముట్టే వరకు ఈ ఆపరేషన్ కొనసాగించాలని ప్రభుత్వం, భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ములుగు జిల్లా, వెంకటాపురం సరిహద్దును కేంద్రంగా చేసుకొని ఛత్తీస్‌గఢ్‌లోని కొత్తపల్లి మొదలుకొని భీమారంపాడు, కస్తూరిపాడు, చినఉట్లపల్లి, పెదఉట్లపల్లి, పూజారికాంకేర్, గుంజపర్తి, నంబి, ఎలిమిడి, నడిపల్లి, గల్గంలో ప్రధానంగా ఆపరేషన్ కొనసాగుతోంది. రుద్రారం పొడవునా ఉన్న కర్రెగుట్టలను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు వేల సంఖ్యలో బలగాలు జల్లెడపడుతూ కొండలపైకి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అతి కష్టం మీద శనివారం సాయంత్రం కొంతమేరకు ఎక్కగలిగిన బలగాలు మావోయిస్టులు తలదాచుకున్నట్లు భావిస్తున్న సొరంగాన్ని గుర్తించాయి. ఇప్పటివరకు ముగ్గురు మహిళా మావోయిస్టుల మృతదేహాలను, ఆయుధాలను, పెద్దఎత్తున పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందినట్లుగా విస్తృత ప్రచారం సాగినప్పటికీ అధికారులు నిర్ధారించలేదు.

Related News

Select the Topic
Scroll to Top