అమరావతి డిసెంబర్ 4 (ఈ తరం భారతం );వైసీపీ హయాంలో ఆస్తులు లాక్కోవడం ట్రెండ్‌గా మారితే.. వాటిని చూసి మౌనం వహించడం కూటమి సర్కార్ ట్రెండ్‌గా పెట్టుకుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటినా గత ప్రభుత్వం ధారాదత్తం చేసిన ఏ ఒక్క ఆస్తిపై, కనీసం ఒక్క చర్య కూడా లేదని విమర్శించారు. విచారణకు సైతం దిక్కులేదని అన్నారు.రాష్ట్రంలో కాకినాడ పోర్టు ఒక్కటే కాదు..కృష్ణపట్నం పోర్టును గుంజుకున్నారని వైఎస్ షర్మిల అన్నారు. ప్రభుత్వ ఆధీనంలో అత్యధిక లాభాలు గడించే గంగవరం పోర్టును అప్పనంగా అమ్మేశారని పేర్కొన్నారు. ఏపీని పోర్టులకు హబ్‌గా మార్చే పాలసీలు సరే.. మరి గంగవరం పోర్ట్ సంగతేంటని కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల డిమాండ్ చేశారు. ప్రతి ఏటా దాదాపు రూ.2వేల కోట్ల లాభాలు గడించే పోర్టును గత వైసీపీ ప్రభుత్వం 2021లో అదానీకి రాసి ఇచ్చిందని తెలిపారు. నికర ఆర్థిక నిల్వలతో పాటు.. రూ.9వేల కోట్ల విలువజేసే 10 శాతం వాటాను కేవలం రూ.640 కోట్లకు పుట్నాల కింద అమ్మారని చెప్పారు. 2,800 ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను అదానీకి కట్టబెట్టారని ఆరోపించారు. BOT కింద ఇంకో 15 ఏళ్లలో పూర్తిగా ప్రభుత్వపరం అవ్వాల్సిన పోర్టు అది అని.. అదానీకి కట్టబెట్టేటప్పుడు ఎలాంటి టెండర్లు లేవని.. కళ్ళు మూసీ తెరిచేలోగా అన్ని అనుమతులు ఇచ్చేశారని విమర్శించారు. పైగా మిగతా పోర్టుల అభివృద్ధికి ఆ నిధులు ఉపయోగం అని బుకాయించారని అన్నారు.ప్రతిపక్షంలో ఉండగా గంగవరం పోర్టుపై చెప్పిన మీ మాటలకు,ఇచ్చిన హామీలకు, ఇప్పుడు అమలు చేస్తున్న విధానాలకు ఎంతమాత్రం పొంతన లేదని కూటమి ప్రభుత్వాన్ని షర్మిల విమర్శించారు. గంగవరం పోర్టులో ప్రభుత్వానికి ఉన్న వాటాను వెనక్కు తీసుకొనే విధంగా చర్యలు చేపట్టాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.