తల్లి, చెల్లిపేరుతో ఎందుకు రాజకీయం చేస్తున్నారని మండిపాటు
నీకు కుటుంబం ఉంది కదా.. మీ తల్లిదండ్రులను ఎప్పుడైనా రాష్ట్ర ప్రజలకు చూపించారా
ఎప్పుడైనా ఇంటికి పిలిచి వారికి రెండు పూటలా భోజనం పెట్టారా
వాళ్లు కాలం చేస్తే తలకొరివి పెట్టావా అని ఆగ్రహం వ్యక్తం
అమరావతి నవంబర్ 20 (ఈ తరం భారతం );తన కుటుంబాన్ని రాజకీయాల్లో లాగడంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి, చెల్లిపేరుతో ఎందుకు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జగన్ మీడియాతో మాట్లాడుతూ.. షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించలేదా అని జగన్ ప్రశ్నించారు.ఐటీడీపీ పేరుతో తమ కుటుంబంపై తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై, తన తల్లి, చెల్లిపై అసభ్య పోస్టులు పెట్టారని మండిపడ్డారు. వ్యక్తిత్వ హననం చేసేలా పోస్టులు పెట్టారని చెప్పారు. ఉదయ్ భూషణ్ అనే ఐటీడీపీ కార్యకర్తతో తన కుటుంబాన్ని తిట్టించారని తెలిపారు. వర్రా రవీందర్ రెడ్డి పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయించారని.. ఆర్జీవీపై తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. సెన్సార్ బోర్డు అనుమతితోనే ఆర్జీవీ సినిమాలు విడుదల చేశారని తెలిపారు. వర్మకు సెన్సార్ బోర్డు అనుమతి ఉందని చెప్పారు. చంద్రబాబు ఎల్లో బ్యాచ్ ఏ సినిమాలైనా తీయొచ్చా అని ప్రశ్నించారు.నీకు కుటుంబం ఉంది కదా.. మీ తల్లిదండ్రులను ఎప్పుడైనా రాష్ట్ర ప్రజలకు చూపించారా అని చంద్రబాబును జగన్ ప్రశ్నించారు. ఎప్పుడైనా ఇంటికి పిలిచి రెండు పూటలా భోజనం పెట్టారా అని నిలదీశారు. వాళ్లు కాలం చేస్తే తలకొరివి పెట్టావా అని ఆగ్రహం వ్యక్తంచేశారు.