న్యూ డిల్లీ మే 13 (ఈతరం భారతం);భారత వస్తువులపై అమెరికా విధించిన సుంకాల కు ప్రతీకారంగా.. అమెరికా వస్తువులపై భారత్ సుంకాలు విధించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ కు తెలియజేసింది. భారత స్టీల్, అల్యూమినియంపై అమెరికా విధించిన సుంకాలకు ప్రతిగా భారత్ ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. కొన్ని ప్రత్యేకమైన అమెరికా వస్తువులకు ఇస్తున్న రాయితీలను నిలిపివేసి, దిగుమతి సుంకాలను పెంచనున్నట్లు వెల్లడించింది.అమెరికా ఇటీవల విధించిన టారిఫ్‌ల కారణంగా 7.6 బిలియన్ డాలర్ల విలువైన భారత ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడనుంది. అందుకే అగ్రరాజ్యం రక్షణాత్మక వైఖరిని అవలంభిస్తోందని భారత్ తప్పుపట్టింది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై భారీఎత్తున టారిఫ్‌లు విధించారు. క్రూడ్ స్టీల్ తయారీలో ప్రపంచంలోనే భారత్ రెండో స్థానంలో ఉంది. ఇప్పుడు దీనిపై ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం పడనుంది.ఇప్పుడు అమెరికా వస్తువులపై ప్రతీకార టారిఫ్‌లు విధిస్తామని ప్రపంచ వాణిజ్య సంస్థకు భారత్ తెలియజేయడం ఇరుదేశాల మధ్య వాణిజ్య ఘర్షణ పెరుగుతోందనడానికి సంకేతంగా చెప్పవచ్చు. సరికొత్త వాణిజ్య ఒప్పందానికి న్యూఢిల్లీ-వాషింగ్టన్ అత్యంత సమీపానికి వచ్చినట్లు వార్తలొస్తున్న వేళ ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. అమెరికాకు వాణిజ్యలోటును తగ్గించడం కోసం ఈ డీల్ ద్వారా భారత్ చాలా రాయితీలను ఆఫర్ చేసినట్లు సమాచారం.