బెంగళూరు ఏప్రిల్ 25 (ఈతరం భారతం);: ప్రముఖ శాస్త్రవేత్త, ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్(84) కన్నుమూశారు. బెంగళూరులోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన పూర్తి పేరు కృష్ణస్వామి కస్తూరి రంగన్. కేరళలోని ఎర్నాకులంలో ఆయన జన్మించారు. ముంబై యూనివర్సిటీలో ఫిజిక్స్‌లో మాస్టర్స్ చేసిన రంగన్.. అహ్మదాబాద్ ఫిజికల్ రీసెర్చ్ లాబోరేటరీ నుంచి 1971లో డాక్టరేట్ అందుకున్నారు.990 నుంచి 1994 వరుకూ ఆయన యూఆర్ఎసి డైరెక్టర్‌గా పని చేశారు. 1994 నుంచి 2003 వరకూ తొమ్మిదేళ్ల పాటు భారతీయ అంతరీక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఛైర్మన్‌గా సేవలు అందించారు. జెఎన్‌యూ ఛాన్సలర్‌గా, కర్ణాటక నాలెడ్జ్ కమిషన్ ఛైర్మన్‌గా కస్తూరిరంగన్ పనిచేశారు. 2003-2009 వరకూ ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అంతేకాకుండా ప్రణాళికా సంఘం సభ్యుడిగానూ సేవలందించారు. దీంతో పాటు మోదీ సర్కార్ తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా రంగన్ పని చేశారు.ఇస్రో శాస్త్రవేత్త నంబీ నారాయణన్ మీద దేశద్రోహం ఆరోపణలు వచ్చినప్పుడు ఇస్రో ఛైర్మన్‌గా ఉంది కస్తూరి రంగనే. 1969లో ఆయన లక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం.
