శ్రీనగర్ ఏప్రిల్ 25 (ఈతరంభారతం);: పహల్‌గామ్ ఉగ్ర దాడి వెనుక వ్యూహం దేశ ప్రజలను చీల్చడం అని, ఉగ్రవాదాన్ని శాశ్వతంగా ఓడించేందుకు భారత్ సంఘటితంగా నిలవడం తప్పనిసరి అని లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ శుక్రవారం ఉద్ఘాటించారు. ‘అది దుర్భర విషాదం. ఏమి జరుగుతోందో తెలుసుకుని, సాయం చేయడానికి ఇక్కడికి వచ్చాను. జమ్మూ కాశ్మీర్ ప్రజలు అందరూ ఈ భీకర దాడిని ఖండించారు. వారు దేశానికి పూర్తి మద్దతు ప్రకటించారు’ అని రాహుల్ శ్రీనగర్‌లో విలేకరులతో చెప్పారు. శుక్రవారం ఉదయం శ్రీనగర్ చేరుకున్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ క్షతగాత్రుల గురించి వాకబు చేయడానికి బాదామిబాఘ్ కంటోన్మెంట్‌లో ఆర్మీ 92 బేస్ ఆసుపత్రిని సందర్శించారు. ‘క్షతగాత్రుల్లో ఒకరిని పరామర్శించాను. తక్కినవారు వెనుకకు వెళ్లిపోయినందున వారిని కలుసుకోలేకపోయాను. కుటంబ సభ్యులను కోల్పోయిన ప్రతి ఒక్కరికీ నా సానుభూతి. దేశం సంఘటితంగా నిలుస్తున్నదని ప్రతి ఒక్కరికీ తెలియాలని అనుకుంటున్నా’ అని రాహుల్ చెప్పారు. గురువారం ఢిల్లీలో జరిగిన అఖిల పక్ష సమావేశం గురించి రాహుల్ ప్రస్తావిస్తూ, మొత్తం ప్రతిపక్షాలు ఉగ్ర దాడిని ఖండించాయని, ప్రభుత్వానికి దన్నుగా ఉన్నాయని తెలిపారు. రాహుల్ జెకె లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను కూడా కలుసుకున్నారు. పహల్‌గామ్‌లో పరిణామాల గురించి ఆయనకు వారిద్దరు వివరించారు. ‘మా పార్టీ వారికి మద్దతు ఇవ్వబోతున్నదని వారిద్దరికీ హామీ ఇచ్చాను’ అని రాహుల్ తెలియజేశారు. రాహుల్ అంతకుముందు వర్తకుల ప్రతినిధివర్గాన్ని, విద్యార్థుల నాయకులను, పర్యాటక రంగానికి సంబంధించినవారిని కలుసుకున్నారు.