Eetaram Bharatam ఈతరం భారతమ్
Search
📗Eetaram Bharatam Journal Coming Soon.📕

పహల్గాం దాడి వెనుక ‘లష్కర్‌ ఎ తోయిబా’ చీఫ్ హఫీజ్ సయీద్ హస్తం

న్యూ డిల్లీ ఏప్రిల్ 25 (ఈ తరం భారతం ); మూడు రోజుల క్రితం జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం సమీపంలోగల బైసరన్‌ లోయలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన దాడి యావత్‌ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఏకంగా 26 మందిని పొట్టనపెట్టుకున్న ఆ దాడిని ప్రత్యక్షంగా చూసిన బాధితులు ఇంకా షాక్‌ నుంచి తేరుకోలేకపోతున్నారు. అయితే ఈ క్రూరమైన దాడి వెనుక ‘లష్కర్‌ ఎ తోయిబా’ చీఫ్ హఫీజ్ సయీద్ హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. హఫీజ్‌ సయీద్‌తోపాటు అతడి ముఖ్య అనుచరుడు సైఫుల్లా ఉగ్రవాదులను అమాయకుల మీద ఊసిగొల్పారని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.లష్కర్‌ ఎ తోయిబాకు అనుబంధంగా ఉండే కరుడుగట్టిన ఉగ్రవాదుల బృందం మంగళవారం బైసరన్‌లో నిర్దాక్షిణ్యంగా 26 మంది అమాయకులను మట్టుపెట్టింది. నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఆ బృందంలో ప్రధానంగా విదేశీ ఉగ్రవాదులు ఉంటారు. ఆ ఉగ్రవాదులకు స్థానిక ఉగ్రవాదులతోపాటు కశ్మీర్‌లో మద్దతుదారులు కొందరు సహకరించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్థాన్‌ ప్రభుత్వ మద్దతుతో హఫీజ్ సయీద్, అతడి ముఖ్య అనుచరులు ఈ ఉగ్రమూకలకు నేరుగా సాయపడి ఉండవచ్చని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.ముంబైలో 26/11 దాడికి కారకుడైన హఫీజ్ సయీద్ ఈ దాడిలో పాల్గొన్న టెరరిస్టులకు కూడా అన్ని రకాలుగా సహాయసహకారాలు అందించి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రదాడికి పాల్పడిన బృందం చాలాకాలంగా కశ్మీర్‌ లోయలో క్రియాశీలకంగా ఉన్నట్టు నిఘా వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది సోనామార్గ్, బూతాపత్రీ, గండేర్బల్ దాడుల్లో ఈ బృందమే పాలుపంచుకున్నట్లు తెలిసింది. గత అక్టోబర్‌లో బూతాపత్రిలో జరిగిన దాడిలో ఇద్దరు ఆర్మీ జవాన్లు సహా మొత్తం నలుగురు మృతి చెందారు. అదే నెలలో సోనామార్గ్ టెన్నెల్ కార్మికులను టార్గెట్ చేస్తూ జరిగిన దాడిలో ఆరుగురు కార్మికులతో పాటు ఓ డాక్టర్ మరణించారు.అయితే, గత డిసెంబర్‌లో ఈ టెరరిస్టు బృందానికి చెందిన జునైద్ అహ్మద్ భట్ అనే లష్కర్‌ ఎ తోయిబా ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. మిగిలిన వారు ఎలాగోలా తప్పించుకుని సమీప అడవుల్లోకి పారిపోయారు. కాగా భారీ దాడి చేసిన తర్వాత ఈ ఉగ్రమూకలు అండర్‌ గ్రౌండ్‌లోకి వెళ్లిపోతాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి. పాకిస్థానీ హ్యాండర్ల నుంచి తదుపరి ఆదేశాలు అందేవరకు అక్కడి అడవుల్లోనే తలదాచుకుంటారని తెలుపుతున్నాయి. వీరికి పాక్ మిలిటరీతోపాటు ఐఎస్ఐ నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అంది ఉండొచ్చని అనుమానిస్తున్నాయి.

 

దాడి జరిగిందిలా..

 

బైసరన్ లోయలో మూడు ప్రదేశాలను టార్గెట్ చేసుకున్న ఉగ్రమూకలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. పోలీసుల కథనాల ప్రకారం ఓ ప్రాంతంలో ఐదు మందిని, మరో మైదాన ప్రాంతంలో ఇద్దరిని, లోయ సరిహద్దు వద్ద మిగతా 19 మందిని ఉగ్రవాదులు బలితీసుకున్నారు. ఫెన్సింగ్ దాటి పారిపోగలిగిన వారు ఈ దాడి నుంచి తప్పించుకోగలిగారు.

Related News

Select the Topic
Scroll to Top