న్యూ డిల్లీ ఏప్రిల్ 27 (ఈ తరం భారతం ); భారతదేశంపై అణుబాంబులతో విరుచుకుపడుతామని పాకిస్థాన్ హెచ్చరించింది. ఆదివారం పాకిస్థాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ భారత్‌పై ఇక బహిరంగ అణ్వాయుధ ప్రతీకార దాడికి దిగుతామని హెచ్చరించారు. ఇప్పటికే తమ వద్ద ఉన్న 130 అణ్వాయుధ వ్యవస్థలను మహరించినట్లు వీటికి తోడుగా ఘోరి, షహీన్, గజ్నవి వంటి క్షిపణులను సిద్ధం చేశామని, ఇక భారతదేశం దారికి రాకపోతే వీటిని ప్రయోగించి తీరుతామని ఆయన హెచ్చరించారు. పాకిస్థాన్‌కు భారతదేశం నీటి సరఫరా నిలిపివేసి చూస్తే ఇక పరిస్థితి ఎంత తీవ్రస్థాయికి వెళ్లుతుందో తాము చెప్పలేమని అన్నారు. ఇక కాబోయే చర్యలు తమ దేశ సైనిక వర్గాలు చూసుకుంటాయి. తమ వద్ద ఉన్న ఆయధాలకు తిరుగులేదు, ఇక ప్రత్యేకించి అణుబాంబుల గురించి చెప్పాల్సిన పనిలేదని మంత్రి వివరించారు. భారత్‌పై ఇక తమది పూర్తి స్థాయి యుద్ధం అని ప్రకటించారు. ఈ మంత్రి ప్రకటన పలువిధాలుగా కలవరం లేవనెత్తింది. తమ దేశంలో పలు చోట్ల అత్యంత వ్యూహాత్మకంగా అణ్వాయుధాలను నిలిపి ఉంచినట్లు ఆయన తెలిపారు. పాకిస్థాన్ గగనతలంపై వైమానిక యానం నిషేధాన్ని అమలు చేస్తే అది భారత్‌కు పిడుగుపాటు అవుతుందని, వెంటనే భారత్‌కు చెందిన పలు వైమానిక సంస్థలు కుప్పకూలుతాయి.ఇండియన్ ఎయిర్‌లైన్స్ పతనం కేవలం భారత ప్రభుత్వ చేతల్లో ఉందని తెలిపారు. తాము అణ్వాయుధాలను కేవలం ప్రదర్శనలకు సిద్ధం చేసుకోలేదని , వీటికి పనిచెప్పే క్షణం ఇప్పటికీ వచ్చిందని వ్యాఖ్యానించారు. బెదిరిస్తే బెదిరిపోం, రెచ్చగొడితే చూస్తూ ఊరుకునేది లేదని, ఏరిపారేస్తామని తెలిపారు. తమ అణ్వాయుధ శక్తి పాటవం గురించి భారత్‌కు సరియైన అవగావహన లేదన్నారు. భారతదేశంపైకి తమ ఆయుధాలు ఏ దిక్కు నుంచి ఎప్పుడు ఏ విధంగా వచ్చిపడుతాయనేది ఎవరికి తెలియదని తెలిపారు. ఇక్కడి ఖండాంతర భీకర క్షిపణుల గురిని పూర్తిగా భారత్ వైపు నిలిపివుంచామని ,ఇక ట్రిగ్గర్ నొక్కడమే తరువాయి అని, విధ్వంసానికి బాధ్యులు ఎవరు? అనేది తరువాత తెలుసుకుని ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు. ఉగ్రదాడుల సాకుతో పాకిస్థాన్‌కు ఏకపక్షంగా నదీ జలాల పంపిణి నిలిపివేస్తారా? గగనతల రాకపోకలకు వీలు కల్పించకుండా ఉంటారా? వీసాల రద్దుకు దిగుతారా? దీని వల్ల నష్టం ఎవరికి తెలుసా? అని ప్రశ్నించారు. ఇప్పటికే ఈ రెండు రోజుల్లోనే భారతీయ వైమానిక రంగం కుదేలు అయింది. మరో పదిరోజులు పోతే పూర్తిగా దివాళాకు వెళ్లుతుందని హెచ్చరించారు పలు ప్రతీకార చర్యలతో భారత్ తనకు తాను శిక్ష విధించుకొంటోంది. ఇది ఓ విధంగా భారత్ స్వీయ లిఖిత మరణశాసనం కానుందని ఘాటుగా స్పందించారు.
పదే పదే ఉగ్ర దాడుల పసలేని వాదన
ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఉగ్రదాడులు జరిగినా వాటికి పాకిస్థాన్‌పై నిందలకు దిగడం భారత్‌కు అలవాటు అయింది. అసలు ఎందుకు దాడులు జరిగాయి? ఆ దేశ ఇంటలిజెన్స్ వర్గాల వైఫల్యం గురించి , డీలా పడ్డ భద్రతా బలగాల శక్తియుక్తుల గురించి విశ్లేషించుకోవడం లేదని మంత్రి మండిపడ్డారు. వాణిజ్యపరమైన ఆంక్షలకు దిగడం కేవలం భారత్‌కు తెలుసునా? ఇప్పటికే తమ దేశం పలు ప్రతిచర్యలకు దిగిందని గుర్తు చేశారు. ఇటీవలే పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ ఓ ప్రకటన చేశారు. ఇందులో ఆయన తమ దేశం పలు కారణాలతో ఉగ్రవాద సంస్థలకు నిధులు అందించడం ,మద్ధతు నివ్వడం జరిగిందని , శిక్షణ కూడా సాగుతోందని అంగీకరించారు. గత మూడు దశాబ్ధాలుగా ఇదే తంతు సాగుతోందని తెలిపి ఇందుకు ప్రధాన కారణం, తెరవెనుక సూత్రధారులు అమెరికా, యూరప్ దేశాలు, బ్రిటన్ అని విమర్శించారు.ఈ చెత్త పనిని తాము ఇతర దేశాలతో కలిసి సాగిస్తున్నామని , అయితే ఈ తప్పిదంతో తమ దేశం పూర్తిగా కోలుకోలేని రీతిలో దిగజారిందని గుర్తించి చింతిస్తున్నామని కూడా ఓ ఇంటర్వూలో ఈ మంత్రి తెలిపారు. తమ దేశం సోవియల్ యూనియ్ వ్యతిరేక యుద్ధంలో చేరకపోయి ఉంటే, తరువాత 9/11 దాడుల అనంతరం అమెరికాకు అనుకూల ధోరణి అవలంభించకుండా , స్వతంత్రంగా ఉండి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి రాకపోయేదని, తిరుగులేని విజయపథంలో సాగేవారిమని చెప్పారు. అసలు పాకిస్థాన్‌లో ఇప్పుడు లష్కరే తోయిబా ఆనవాళ్లే లేవు. దాడులకు ఇక్కడి నుంచి వ్యూహ రచన సాగిందని, ఉగ్రవాదులు సరిహద్దులుదాటి వెళ్లి దాడులకు దిగుతున్నారని చెప్పడం కేవలం భారతదేశ వైఫల్యం తప్పితే మరోటి కాదని పాకిస్థాన్ మంత్రులు ఇప్పుడు ఎదురుదాడులకు దిగుతున్నారు.