న్యూ డిల్లీ (ఈ తరంభారతం) ఏప్రిల్ 28 : భారత సైనిక దళాల సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రఫేల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి ఫ్రాన్స్ దేశంతో భారత్ ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ ఒప్పందంపై ఇరు దేశాలూ సంతకాలు చేశాయి. భారత్, ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య కుదిరిన ఈ భారీ ఒప్పందం విలువ 7.6 బిలియన్ డాలర్లు. అంటే భారత కరెన్సీలో రూ.64,000 కోట్లన్నమాట.ఒప్పందంలో భాగంగా భారత నావికాదళానికి ఫ్రాన్స్ నుంచి 22 సింగిల్ సీటర్, నాలుగు టు సీటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు రానున్నాయి. దీంతోపాటు వీటి నిర్వహణ, స్పేర్లు, లాజిస్టికల్ సపోర్ట్, శిక్షణకు సంబంధించిన అంశాలు సకాలంలో పూర్తయ్యేలా ఫ్రాన్స్ ప్రభుత్వమే చూసుకుంటుంది. వాయుదళ శక్తిని పటిష్టం చేసే లక్ష్యంతో రఫేల్ యుద్ధ విమానాలను ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. శక్తివంతమైన ఆధునిక ఆయుధ వ్యవస్థలను కలిగి ఉండే రఫేల్ యుద్ధ విమానాలు భారత నౌకాదళ పోరాట శక్తిని బలోపేతం చేయనున్నాయి. నాలుగేళ్లలో రఫేల్ యుద్ధ విమానాల సరఫరా ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇక ఒప్పందం ప్రకారం.. తొలిబ్యాచ్ 2029లో రావొచ్చని.. 2031 నాటికి మొత్తం చేతికొచ్చే అవకాశాలున్నాయి
