ఈతరం భారతం తిరుమల ఏప్రిల్ 14 :కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ సతీమణి శ్రీమతి అన్నా కొణిదల దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోని ప్రవేశించి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీమతి అన్నా కొణిదల కి వేద పండితులు వేదాశీర్వచనం అందించి, శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి ఆలయం ఎదురుగా ఉన్న అఖిలాండం వద్ద హారతులు ఇచ్చారు. స్వామి వారికి కొబ్బరికాయ కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. స్వామి వారి దర్శనానంతరం ఉదయం 10 గంటల సమయంలో శ్రీమతి అన్నా కొణిదల మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రాన్ని సందర్శించారు. కుమారుడు కొణిదల మార్క్ శంకర్ పేరిట రూ. 17 లక్షలు విరాళాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు అందించారు. అనంతరం నిత్యాన్నదాన సత్రంలో శ్రీవారి భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. అనంతరం భక్తులతో కలసి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.
