హనుమకొండ జనవరి13 (ఈతరం భారతం);శ్రీ రామకృష్ణ సేవాసమితి హనుమకొండ మరియు వివేకానంద విద్యాకేంద్రం వరంగల్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జన్మదినము పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవాన్ని శ్రీరామకృష్ణ సేవాసమితి హనుమకొండ ప్రాంగణంలో సేవాసమితి అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన జ్యోతి ప్రజ్వలన జరిగిన పిమ్మట ఆహూతులందరికీ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి మామిడి జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి బాల్యం నుండి వృద్ధాప్యం వరకు తెలుసుకునే పరిజ్ఞానం వెలకట్టలేనిదని, అలా నేర్చుకున్న మంచిని ఆచరణలో పెడితే సభ్య సమాజంలో గొప్పవారవుతారని, విద్యార్థులు స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని ఉన్నత విలువలతో తమ జీవితానికి సార్థకత వచ్చేలా ఎదుగాలని సూచించారు. విశిష్ట అతిథి ప్రముఖ విద్యావేత్త గంటా రవికుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండి తమ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని, తన జీవితమే ఒక ఉదాహరణగా పేపర్ బాయ్ గా మొదలై లక్షల్లో తన ఉద్యోగులకు వేతనాలిచ్చే స్థాయికి ఎదిగానని అందుకు ఆత్మవిశ్వాసం ఎంతో అవసరమని, ఎవరైనా దృఢసంకల్పంతో శ్రమిస్తే ఆశించిన ఫలితం వస్తుందని తెలియజేశారు. వరంగల్ కాశీబుగ్గలోని వివేక భారతి విద్యా కేంద్రం వ్యవస్థాపకులు విష్ణు మాట్లాడుతూ విద్యార్థులకు స్వామీ వివేకానంద జీవితాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో స్వామి వివేకానంద జీవితం మరియు వారి భావజాలంపై వరంగల్ పట్టణంలోని… డెల్టా, ప్రగతి, శ్రీ సరస్వతి విద్యా నికేతన్, శారదా, విజ్ఞాన్, శ్రీ సాయి విజ్ఞాన భారతి, స్టాండర్డ్, ఇండియన్ మరియు వివేకానంద విద్యా నికేతన్ మొత్తం ఎనిమిది ఉన్నత పాఠశాలల విద్యార్థులకు క్విజ్ పోటీని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఒక్కొక్క పాఠశాలనుండి ఐదుగురు విజేతలకు ప్రశంసాపత్రాలు, షీల్డ్ మరియు నగదు రూపేణ బహుమతి వితరణ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కాసర్ల సరోజన గారి కూతురు బహూకరించిన వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. గిన్నీస్ బుక్ లో నమోదయిన అయిదేండ్ల లోపు వయసుగల బాలురు ధీరజ్ సాయి సోదరుల ప్రతిభ అద్భుతం.ఈ కార్యక్రమంలో ఆంగ్ల భాషా నిపుణులు డా॥ దామోదర్, సంస్కృత భాష ఉపన్యాసకులు శ్రీనివాస్ ప్రత్యేకాహ్వానితులుగా హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమంలో సేవాసమితి బాధ్యులు జినుగు విష్ణువర్ధన్ రెడ్డి, మూల తిరుపతి రెడ్డి, కక్కెర్ల శ్రీనివాస స్వామి, కే.సూర్య, చిదర అంజనీ దేవి, లక్ష్మీ రావు, మూల లక్ష్మీదేవి, బోయినపల్లి పార్వతి, అశోక్ రెడ్డి, రావుల రాజగోపాల్ రెడ్డి, రిటైర్డ్ టీచర్ కనకయ్య, వాలంటీర్లు సాత్విక్, శివరాం లక్ష్మణ్, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.