శిరీష శ్రీభాష్యంకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
ఈతరం భారతం హైదరాబాద్ ప్రతినిధి 4.9.24
హన్మకొండ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు కవయిత్రి, తెలుగు ఉపాధ్యాయురాలు శిరీష శ్రీభాష్యం ఉపాధ్యాయ దినోత్సవం – 2024ను పురస్కరించుకొని ఎంపికయ్యారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు. శిరీష తెలుగు స్కూల్ అసిస్టెంట్‌గా కమలాపూర్ మండలం ఉప్పల్‌లోని జడ్పీహెచ్ఎస్ బాలుర హైస్కూల్‌లో విధులను నిర్వహిస్తున్నారు. అనేక కవితలు, వ్యాసాలను రచించడమే కాకుండా నిశ్శబ్ద లయలు కవితాసంపుటిని ఆమె ప్రచురించారు. హైద్రాబాద్ రవీంద్రభారతిలో అస్తిత్వం సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును 2019లో, 2020లో శారదాపీఠం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును, 2022లో రాష్ట్ర ఉపాధ్యాయ పండిత పరిషత్ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను శిరీష అందుకున్నారు. సాహిత్య కృషికి గానూ గానూ 2019లో కళాసాహితీ సంస్థ వారి గిడుగు రాంమూర్తి పంతులు పురస్కారాన్ని, 2024లో సావిత్రిబాయిపూలె అవార్డును శిరీష స్వీకరించారు. పలు సాహిత్య, సాంస్కృతిక, బోధనా, ఆధ్యాత్మిక సంస్థల సత్కారాలను కూడా శిరీష పొందారు. హన్మకొండ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన శిరీషకు పలువురు అభినందనలు తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును గురువారం మధ్యాహ్నం హన్మకొండ కలెక్టరేట్‌లో జరిగే కార్యక్రమంలో శిరీష అందుకోనున్నారు.