ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.23.01.2025 : జిల్లా కలెక్టర్ అంటేనే పెద్ద బాధ్యత. సమీక్షలు, సమావేశాలు అంటూ ఎప్పుడూ బిజీబిజీగా ఉంటుంటారు. ముఖ్యమంత్రితో చర్చలు, మంత్రులతో మీటింగులు, అధికారులతో సమావేశాలంటూ ఊపిరాడని పని ఉంటుంది. కుటుంబసభ్యులతో కలిసి గడిపే సమయం కూడా వారికి దొరకడం కష్టంగా మారుతుంటుంది. అయితే ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాత్రం కాస్త డిఫరెంట్‌గా కనిపిస్తున్నారు. ఖాన్ పేరు చెప్తేనే విద్యార్థుల ముఖాల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. కలెక్టర్ స్థాయిలో ఎప్పుడూ బిజీగా ఉన్నప్పటికీ సమయం కుదుర్చుకుని మరీ ఆయన చిన్నారులు, విద్యార్థులను కలుస్తున్నారు. వారికి సొంత అన్నలాగా అండగా నిలుస్తున్నారు. విద్యార్థులతో మాట్లాడి జీవితం నేర్పే పాఠాల గురించి దిశానిర్దేశం చేస్తున్నారు. జీవితంలో ఎదుర్కోవాల్సిన సవాళ్లపై కూలంకషంగా మాట్లాడుతున్నారు.ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌కు విద్యార్థులంటే ఎంతో ప్రేమ. కష్టపడి చదివి కలెక్టర్‌గా ఉన్నతస్థాయికి రావడంతో తనలాగే పది మంది ఎదిగేందుకు సహాయం చేయాలని ఆయన ఎప్పుడూ తహతహలాడుతుంటారు. ముఖ్యంగా విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపితే జీవితంలో సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని ఉన్నతస్థాయికి చేరుకుంటారని కలెక్టర్ బలంగా నమ్ముతారు. అందుకే వారితో సమయం గడిపేందుకు ఇష్టపడతారు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ సమయం కుదుర్చుకుని మరీ వారిని కలుస్తుంటారు. ఇటీవల సంక్రాంతి పండగ వేళ అనాథ పిల్లలను ఆయన కుటుంబసభ్యుల్లాగా చూసుకున్నారు. ట్రైనీ కలెక్టర్, అదనపు కలెక్టర్లతో కలిసి ప్రభుత్వ బాలికల సదనంలో ఉండే 25 మంది చిన్నారులకు మజమ్మిల్ ఖాన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. వారందరినీ ఓ పెద్ద స్టార్ హోటల్‌కు తీసుకెళ్లి మంచి భోజనం పెట్టించారు. దీంతో ఆయన్ను పలువురు ప్రశంసలతో ముంచెత్తారు.కాగా, తాజాగా ఖమ్మంలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సెంటెనరీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ జూనియర్ కళాశాలను కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది కుర్చీలు వేసినప్పటికీ ఆయన విద్యార్థినులతో కలసి నేలపైనే కూర్చున్నారు. వారితో ఓ అన్నలాగా ఆపాయ్యంగా మాట్లాడారు. జీవితంలో పెద్దపెద్ద లక్ష్యాలను మాత్రమే పెట్టుకోవాలని విద్యార్థినులకు ముజమ్మిల్ ఖాన్ సూచించారు. మన చుట్టూ ఉన్న నెగెటివ్ మైండ్ పీపుల్‌ని పట్టించుకోవద్దని, వారు మన ఎదుగుదలకు ఆటంకంగా మారతారని తెలిపారు. చిన్నచిన్న ఉద్యోగాలు చాలని, ఇంగ్లీష్ రాకపోవడంతో పెద్ద ఉద్యోగాలు సాధించలేరని, ఇక కిరాణా షాపులు వంటివి పెట్టుకుని బతికాల్సిందే అంటూ పలువురు మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారని చెప్పారు. అలాంటి వారి మాటలను ఏ మాత్రం పట్టించుకోవద్దని, జీవితంలో పెద్ద లక్ష్యాలను పెట్టుకుని వాటిని సాధించే దిశగా ముందుకు వెళ్లాలని ధైర్యం చెప్పారు.
జీవితంలో సవాళ్లు వస్తాయని, ఎన్నిసార్లు కిందపడినా తిరిగి లేవాలని విద్యార్థినుల్లో కలెక్టర్ ఉత్సాహం నింపారు. మెుక్కగా ఉన్నప్పుడే దానికి నీళ్లు అందిస్తే మంచి ఏపుగా ఎదుగుతుందని, పెద్దయ్యాక ఏం చేసినా ప్రయోజనం ఉండదని చెప్పారు. అలాగే విద్యార్థులంతా చిన్నప్పుడే కష్టపడి కొత్త విషయాలు నేర్చుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మీకు అన్నీ సౌకర్యాలు కల్పిస్తామని, బాగా చదువుకుంటామని మాట ఇవ్వాలని విద్యార్థులను కలెక్టర్ కోరారు. చిన్న ఆలోచనలు, చిన్న ఆశలు వద్దని, జీవితంలో కుంభస్థలాన్నే కొట్టాలని వారికి ఉపదేశించారు. మంచి భోజనం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పారు. విద్యార్థినిలతో ముచ్చటించిన అనంతరం ముజమ్మిల్ ఖాన్ వారితో కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత విద్యార్థినిలకు ఐఐటీ, జేఈఈ కోసం ఆన్‌లైన్ కోచింగ్‌పై అధికారులతో సమీక్షించారు. కళాశాలలో సౌకర్యాలు మెరుగుపరచాలని, మరుగుదొడ్లు, వంటగది లీకేజీ వంటి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. కళాశాలలో జిమ్ పరికరాలు ఏర్పాటు చేయాలని, మెుక్కలు నాటాలని అధికారులకు సూచించారు.చిన్నతనం నుంచి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని జీవితంలో సక్సెస్ సాధించిన ఖమ్మం కలెక్టర్ ఖాన్.. పేద విద్యార్థులు జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవడంతో పాటు.. చిన్నతనంలో తమ కలలను సాకారం చేసుకునేందుకు తోడ్పాటునందిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.