నాగర్ కర్నూల్ ఏప్రిల్ 16 (ఈతరం భారతం);కొడుకు..పెళ్లి అయిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో తండ్రి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ దారుణ సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వీరయ్య(55) చిన్న కొడుకు పరమేశ్, అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.ఈ క్రమంలో నెల రోజుల క్రితం సదరు మహిళను ఆంధ్రప్రదేశ్ లోని గురజాలకు తీసుకెళ్లి సహజీవనం ప్రారంభించారు. దీంతో మహిళ కుటుంబసభ్యులు.. వారి ఆచూకీ తెలుసుకుని, అక్కడికి వెళ్లి యువకుడిని చితకబాది, ఆమెను తీసుకువచ్చారు. పరమేశ్ పై పగ పెంచుకున్న మహిళ బంధువులు.. మంగళవారం వీరయ్య, తన పెద్ద కొడుకు వెంకటేశ్‌తో కలిసి అచ్చంపేట నుంచి నడింపల్లికి బైక్ పై వెళ్తున్న సమయంలో దారి మధ్యలో మాటు వేసి కారుతో ఢీకొట్టి.. ఆ తరువాత వారి కళ్లల్లో కారం చల్లి.. సుత్తి, గొడ్డలితో దాడి చేశారు. వీరయ్య అక్కడికక్కడే చనిపోగా.. వెంకటేశ్ స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు.విషయం తెలుసుకున్న గ్రామస్తులు హైదరాబాద్–అచ్చంపేట ప్రధాన రహదారిపైనే వీరయ్య మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేపట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోని తమకు న్యాయం చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి.. ఈ ఘటనలో బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.