హుజూర్ నగర్ మార్చి 31 (ఈ తరం భారతం );: పేదలకు సన్నబియ్యం పథకం నిరంతరంగా కొనసాగుతుందని, ప్రభుత్వాలు మారినా సన్న బియ్యం పథకం ఎవ్వరూ ఆపలేరని సిఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఆదివారం ఉగాది పండుగ పర్వదినాన హుజూర్‌నగర్‌లో రేషన్ కార్డులకు సన్నబియ్యం పంపిణీ పథకాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అండగా నిలబడితే మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. శ్రీమంతులు తినే సన్నబియ్యం నేటి నుంచి దారిద్య్రరేఖకు దిగువన ఉండే పేదలు కూడా తినే రోజు లు వచ్చాయన్నారు. ఏప్రిల్ నుంచి రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ ప్రారంభమవుతుందని, ఉగాది రోజున సన్నబి య్యం పంపిణీని ప్రారంభించటం తనకెం తో సంతోషకరంగా ఉందని వెల్లడించారు. సాయుధ రైతాంగ పోరాటం, రోటీ కపడా ఔర్ మఖాన్, రెండు రూపాయల కిలో బియ్యం తర్వాత ఈ ప్రభుత్వం తెచ్చిన సన్నబియ్యం పథకం చరిత్రలో నిలబడుతుంది. సన్నబియ్యం ఆషామాషీ పథకం కాదు.ఏ ముఖ్యమంత్రి వచ్చినా సన్న బియ్యం పథకాన్ని రద్దు చేయలేరు అని స్పష్టం చేశారు. పేదలకు 25 లక్షల ఎకరాలను అసైన్డ్ భూములుగా పంచిన చరిత్ర స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ సొంతమని, దేవుడి ఫోటో పక్కన ఇందిరమ్మ ఫోటో పెట్టుకునే సంస్కృతి తండాల్లో ఉండేదన్నారు. రూ.1.90కే పేదలకు కిలో బియ్యం ఇవ్వాలని మొదట ఆనాటి సిఎం కోట్ల విజయ్‌భాస్కర్‌రెడ్డి భావించారని, ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడంతో రూ.2లకు కిలో బియ్యం పథకాన్ని ఎన్.టి.రామారావు ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం లో ఆనాడు మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు కె.జానారెడ్డి కీలకపాత్ర పోషించారని తెలిపారు. పేదలకు ఆహారభద్రత కల్పించాలన్న లక్షంతో కాంగ్రెస్ పార్టీ 1957లోనే రేషన్ దుకాణాలను ప్రారంభించి బియ్యం ఇచ్చేందుకు నిర్ణయించిందని తెలిపారు.
నల్లగొండకు గొప్ప చరిత్ర ఉంది
దేశంలోనే అత్యధికంగా వడ్లు పండించే జిల్లాల్లో నల్లగొండ జిల్లా ప్రధానమని ముఖ్యమంత్రి తెలిపారు. నల్లగొండ జిల్లా ప్రజలకు గొప్ప చరిత్ర ఉందని, నల్లగొండ జిల్లా పోరాటాల గడ్డ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మల్లు స్వరాజ్యం భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాయుధ పోరాటాలు చేసిన గడ్డ ఇది అన్నారు. రజాకార్లకు వ్యతిరేకంగా ఎందరో ప్రాణాలు అర్పించిన గడ్డ ఇది అన్నారు. క్రిష్ణపట్టి ప్రాంతం చైతన్యానికి మారు పేరు, హుజూర్ నగర్, కోదాడ కాంగ్రెస్ కు కంచుకోట అని కార్యకర్తలు నిరూపించారు, రావి నారాయణరెడ్డి ని దేశంలోనే అత్యంత మెజార్టీతో గెలిపించిన గడ్డ నల్లగొండ అని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.
ప్రజల ఆకాంక్ష మేరకే
రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు రేషన్‌కార్డులపై సన్నబియ్యం పథకానికి శ్రీకారం చుట్టామని సిఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. నల్లగొండ జిల్లాలో 12 లక్షల ఎకరాల్లో వడ్లు పండిస్తున్నారని, గత ప్రభుత్వం మిల్లర్ల దగ్గర 21 వేల కోట్ల వడ్లను దాచి పెట్టిందని విమర్శించారు. రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ఇస్తే ఆ బియ్యాన్ని రూ.10లకు మిల్లర్లు కొని తిరిగి రూ.30లకు ప్రభుత్వానికే అమ్ముతున్నారు, దొడ్డు బియ్యం పేదవాడు వండుకుంటలేరు, దళారుల దోపిడి కి గురవుతున్నాయి, అందుకే ప్రతి పేదవాడికి ఆరు కిలోల సన్నబియ్యం ఇవ్వాలని మంత్రి వర్గ సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, హర్కార్ వేణుగోపాల్, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీదర్ బాబు, అనసూయ సీతక్క, కోదాడ శాసనసభ్యురాలు పద్మావతి, పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ లతో పాటు ఎంపీలు చామల కిరణ్‌కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, మల్లు రవి, మందడి అనిల్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, మందుల సామేలు తదితరులు హాజరయ్యారు. బహిరంగసభ ప్రారంభానికి ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమార్ స్వాగతోపన్యాసం చేస్తూ పేదలకు సన్నబియ్యం పంపిణీ ప్రాధాన్యతను వివరించారు