నిర్మల్ నవంబర్ 15 (ఈతరం ఇండియా న్యూస్); : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేసే బాధ్యత తనదని టీపీసీసీ అద్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం నాడు నిర్మల్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో రేవంత్‌రెడ్డి పాల్గొని మాట్లాడుతూ… ‘‘ఇంద్రకరణ్‌రెడ్డిని ఈ ఎన్నికల్లో ఓడించి బొందపెట్టడానికి వేలాదిగా తరలి వచ్చిన మీకు అభినందనలు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. అందుకే జెండాలు ఎజెండాలు, గ్రూపులు గుంపులు పక్కనబెట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఆనాడు చెప్పిన.. ఈనాడు చెబుతున్నా.. కొడంగల్ లాగే నిర్మల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకుండు. మామా అల్లుళ్ల చేతిలో చిక్కి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అన్యాయానికి గురైంది. బీఆర్ఎస్ పాలనలో ఆదిలాబాద్ ఎడారిగా మారింది. నిర్మల్ మాస్టర్ ప్లాన్ మీ మెడ మీద కత్తిలా వేలాడుతుంది. ఎన్నికల కోసం మాస్టర్ ప్లాన్‌ను తాత్కాలికంగా వాయిదా వేశారు. మళ్లీ బీఆర్ఎస్ గెలిస్తే మాస్టర్ ప్లాన్ పేరుతో మీ భూములు గుంజుకుంటారు. మంత్రిగా ఉండి కూడా ఇంద్రకరణ్‌రెడ్డి ఇక్కడి ప్రజలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదు. అలాంటి ఇంద్రకరణ్‌రెడ్డికి ఎందుకు ఓటు వేయాలి. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీహరి రావుకు ఈ ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇవ్వండి. శ్రీహరిరావుకు ఓటు వేస్తే.. రేవంతన్నకు వేసినట్లే.. సోనియమ్మకు వేసినట్లే. సోనియమ్మ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం. ఔర్ ఏక్ దక్కా.. కాంగ్రెస్ పక్కా’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.