కెసిఆర్ తోనే రైతుల ఆత్మహత్యల్లో దేశంలో తెలంగాణ రెండో స్థానం
ప్రజలనే కాదు వేములవాడ రాజన్నను కూడా కెసిఆర్ మోసం చేశాడు
రాజన్నసిరిసిల్ల సభలో ముఖ్యమంత్రి రేవంత్
రాజన్నసిరిసిల్ల నవంబర్ 20 (ఈతరంభారతం );: మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ తోనే రైతుల ఆత్మహత్యల్లో దేశంలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కెసిఆర్ ను గద్దె దించాలని సిరిసిల్ల పాదయాత్రలో నిర్ణయించుకున్నామని గుర్తు చేశారు. ప్రజలనే కాదు వేములవాడ రాజన్నను కూడా కెసిఆర్ మోసం చేశారని సిఎం ధ్వజమెత్తారు. రాజన్నసిరిసిల్ల సభలో రేవంత్ ప్రసంగించారు.అధికారం పోయేసరికి బిఆర్ఎస్ నేతలకు మైండ్ పోయిందని, బిఆర్ఎస్ సరిగ్గా పరిపాలన చేసి ఉంటే రైతు రుణమాఫీ చేయాల్సి వచ్చేదా? అని, రూ.11 వేల కోట్ల రుణమాఫీకి కెసిఆర్ ఐదేళ్లు తీసుకున్నారన్నారని మండిపడ్డారు. పదేళ్లలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ చేయలేని పనులను పూర్తి చేస్తున్నామని తెలిపారు.కొడంగల్ నియోజకవర్గంపై కెసిఆర్ కు ఎందుకంత కక్ష్య అని అడిగారు. తానేమీ లక్ష ఎకరాలు సేకరించలేదని, తాను సేకరిస్తనన్నది నాలుగు గ్రామాల్లో 1100 ఎకరాలు ఉన్నాయని, భూసేకరణ ప్రపంచ సమస్య అయ్యిందా? అని ప్రశ్నించారు. కెటిఆర్ ఢిల్లీకి వెళ్లి తనపై ఫిర్యాదులు చేస్తున్నారని, కెటిఆర్ ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా ఊచలు లెక్కపెట్టాల్సిందేనని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. భూసేకరణపై కుట్ర చేసినందుకు కెటిఆర్ ఊచలు లెక్కపెట్టడం ఖాయమని స్పష్టం చేశారు. కెటిఆర్ ఉరుకులాటను గమనిస్తూనే ఉన్నానని, ఎంత దూరం ఉరుకుతారో తాను చూస్తానన్నారు.అధికారంలోకి వచ్చిన 11 నెలల్లోనే 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని, ఉద్యోగాలు ఇవ్వలేదని నిరూపిస్తే క్షమాపణలు చెప్తామన్నారు. మిడ్ మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని, సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృషి చేస్తున్నారని, దేశానికి ప్రధానిని అందించిన గడ్డ కరీంనగర్ అని రేవంత్ రెడ్డి కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే ఎంతదూరమైన వెళ్తుందన్నారు. బిజెపి ఎంపి బండి సంజయ్ కుమార్ ను గెలిపిస్తే కేంద్రం నుంచి కరీంనగర్ ఏం తెచ్చారని ప్రశ్నించారు.