జనగామ మార్చ్ 24 (ఈతరం భారతం న్యూస్ );: కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యంతో వేలాది ఎకరాలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులను ఆదుకోవడంలో రేవంత్ రెడ్డి సర్కర్ విఫలమయిందన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో పర్యటించారు. సాగునీళ్లు లేక ఎండిపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ బాధలను హరీశ్‌రావుకు వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేవాదుల ద్వారా పంపింగ్ చేసి నీళ్లు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. ఎన్నికల హామీల్లో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. అప్పుడు అరచేతిలో స్వర్గం చూపెట్టి ఇప్పుడు మొండి చేయి చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటిందని, ఇచ్చిన హామీలు నెరవేర్చక ప్రజలను మోసం చేసింది. కాంగ్రెస్ ఒక్క రూపాయి రుణమాఫీ చేసింది లేదు. రైతు బంధు రూ.15 వేలు ఇస్తామన్నారు.. కానీ రూ.10 వేలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. రైతులు కొత్తగా బోర్లు వేసి అప్పుల పాలవుతున్నారు. రైతు బంధు కౌలు రైతులకు కూడా ఇస్తామని వాళ్లను కూడా మోసం చేసింది. రాష్ట్రంలో 180 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కేసీఆర్ హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారు.. రెండు పంటలు పండాయి. ఇప్పుడు కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియడం లేదని రైతులు అంటున్నారు. కాంగ్రెస్ అడుగడుగునా రైతులను మోసం చేసింది.రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది. సీఎం, మంత్రులకు రైతులను ఓదార్చే ఓపిక లేదు. రైతులు పిట్టల్లా రాలిపోతుంటే ముఖ్యమంత్రి, ఒక్క మంత్రి కూడా పరామర్శించిన పాపాన పోలేదు. ముఖ్యమంత్రికి ప్రతిపక్ష నాయకుల ఇండ్లుకు వెళ్లడానికి.. మా ఎమ్మెల్యేలను గుంజుకునేందుకు టైం ఉంది. మీరు తెరవాల్సింది రాజకీయ పార్టీ గేట్లు కాదు.. ప్రాజెక్టుల గేట్లు తెరిచి రైతులకు నీళ్లు ఇవ్వాలి. ఎకరానికి రూ.25 వేల పంట నష్ట పరిహారం ఇవ్వాలి. దేవరుప్పులలో రైతు సత్తమ్మ నాలుగు బోర్లు వేసి కన్నీటి పర్యంతమవుతున్నారు. ఊరికి వంద బోర్లు వేసుకుంటున్నరు.సీఎం, మంత్రులు హైదరాబాద్‌లో రాజకీయాలు మాని.. వ్యవసాయ క్షేత్రాలు వచ్చి పంట పొలాలను పరిశీలించి రైతుల్లో ధైర్యం నింపాలి. పండిన కొద్ది పంటను రూ.500 బోనస్ ఇవ్వాలి.. లేకుంటే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు అడిగే హక్కు లేదు. కాంగ్రెస్‌కు రైతులు గుణపాఠం చెబుతారు. అవసరమైతే రాబోయే ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని హరీశ్ అన్నారు
.