వరంగల్ ఫిబ్రవరి 24 (ఈ బీ న్యూ స్);అమ్మవారి కుంకుమ భరిణె అంత పవిత్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుంటామని మంత్రి కొండా సురేఖ అన్నారు. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను భక్తులు అనుక్షణం ఆస్వాదించేలా, జాతరను విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములైన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జాతర ఏర్పాట్లు, నిర్వహణలో అన్నిశాఖలు పరస్పర సహకారంతో, సమన్వయంతో వ్యవహరించి, చిత్తశుద్ధిని కనబరచి మహా జాతరను దిగ్విజయం పూర్తి చేశామన్నారు.సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు జాతర పనులను ముందు నుంచే ప్రణాళికాబద్ధంగా చేపట్టడంతో భక్తులు అమ్మవార్లను ప్రశాంతంగా దర్శించుకొని, మొక్కులు చెల్లించుకొని, సంతృప్తితో తిరుగు ప్రయాణమయ్యారని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం భక్తులకు అడుగడుగునా అన్ని వసతులను కల్పించేందుకు శాయశక్తులా ప్రయత్నం చేసిందని మంత్రి స్పష్టం చేశారు.కోట్లాదిగా పోటెత్తిన ఈ మహాజాతరలో తెలిసీ తెలియక భక్తులు ఏమైనా ఇబ్బందులకు గురైతే పెద్ద మనసుతో క్షమించాలని కోరారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా మొదటిసారి మేడారం జాతర నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతను పూర్తి నిష్టతో చేపట్టినట్లు తెలిపారు. అమ్మవారి దయతో అనారోగ్యాన్ని జయించి, త్వరగా కోలుకొని అమ్మవార్లు గద్దెలకు చేరుకున్నాక దర్శించుకునే భాగ్యం కలిగిందన్నారు. సమ్మక్క-సారక్క దయతో తెలంగాణ ప్రజలపై సదా ఉండాలని ఈ సందర్భంగా మంత్రి ఆకాంక్షించారు.