ఆదిలాబాద్ ఏప్రిల్ 16 (ఇతరంభారతం );ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విష ప్రయోగం జరిగింది. విద్యార్థులు తాగే నీటి ట్యాంక్‌లో దుండగులు పురుగుల మందు కలిపారు. మధ్యాహ్న భోజన సామగ్రిపై కూడా పురుగుల మందులు చల్లారు. బుధవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.పాఠశాలకు వరుసగా మూడు రోజులు సెలవులు ఉండటంతో పాఠశాలలోని వంట గదికి సిబ్బంది తాళాలు వేసుకుని వెళ్లారు. సెలవుల అనంతరం పాఠశాలకు వచ్చిన సిబ్బంది వంట చేసేందుకు పాత్రలు కడిగే సమయంలో దుర్వాసన, నురగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పాఠశాల హెడ్ మాస్టర్, సిబ్బంది చుట్టుపక్కల చూడగా పురుగుల మందు డబ్బా కనిపించింది. అలాగే తాగు నీటి ట్యాంక్‌లోనూ పురుగుల మందు కలిపినట్లుగా సిబ్బంది గుర్తించారు. దీంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది.. విద్యార్థులను తాగునీటి కుళాయిల వైపు వెళ్లకుండా చూశారు. మధ్యాహ్న భోజనం వండలేదు. ఈ ఘటనపై ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.సరైన సమయానికి పాఠశాల సిబ్బంది గుర్తించి మధ్యాహ్న భోజనం వండకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ధర్మపురి పాఠశాలలో దాదాపు 30 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరంతా విష ప్రయోగం నుంచి బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనపై పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు మండిపడుతున్నారు. అసలు స్కూల్ పిల్లలపై విష ప్రయోగం చేయాల్సిన అవసరం ఎవరికి ఉందని.. చిన్న పిల్లలు ఏం పాపం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.