న్యూ డిల్లీ ఏప్రిల్ 19 (ఈ తరం భారతం );జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్రవారం రాత్రి ఫలితాలను ప్రకటించింది. శుక్రవారం మధ్యాహ్నం ఫైనల్ కీని విడుదల చేసిన అధికారులు.. ఆ తర్వాత విద్యార్థులు సాధించిన పర్సంటైల్ స్కోర్‌తో ఫలితాలను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో బీఈ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 2, 3, 4, 7, 8 తేదీల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.ఇందులో 24 మంది విద్యార్థులు 100కి వంద పర్సంటైల్ సాధించారు. రాజస్థాన్‌కు చెందిన మహ్మద్ అనాస్ ఫస్ట్ ర్యాంకు, ఆయుష్ సింఘాల్ రెండో ర్యాంక్ సాధించారు. వంద పర్సంటైల్ సాధించిన వారిలో తెలంగాణకు చెందిన హర్ష ఏ గుప్తా, వంగల అజయ్‌రెడ్డి, బనిబ్రత మజీ, ఆంధ్రప్రదేశ్ నుంచి సాయిమనోజ్ఞ ఉన్నారు. హర్ష ఏ గుప్తా దేశవ్యాప్తంగా ఎనిమిదో ర్యాంక్‌ని సాధించగా.. అజయ్‌రెడ్డికి ఆలిండియా 16వ ర్యాంకుతో పాటు ఈడబ్ల్యూస్ కేటగిరిలో ఒకటో ర్యాంక్‌లో నిలిచాయి. సాయిమనోజ్ఞకు ఆలిండియా 22వ ర్యాంక్, బాలికల్లో రెండో ర్యాంక్ సాధించింది. బనిబత్ర మజీ ఆల్‌ఇండియా 24వ ర్యాంకు సాధించింది.
