ఈతరం భారతం హైదరాబాద్ ప్రతినిధి మే 14 :తాజాగా ప్రధాన సమాచార కమిషనర్లు, నలుగురు కొత్త కమిషనర్లను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఐఎఫ్‌ఎస్ అధికారి చంద్రశేఖర్‌రెడ్డిని రాష్ట్ర సమాచార హక్కు ప్రధాన కమిషనర్ను నియమించారు.
కమిషనర్‌లుగా పాత్రికేయుల రంగం నుంచి పీవీ శ్రీనివాసరావు, బోరెడ్డి అయోధ్యరెడ్డిని, న్యాయవాదుల రంగం నుంచి దేశాల భూపాల్, మొహిసినా పర్వీన్‌లను ఎస్‌ఐసీలుగా నియమించారు. ప్రభుత్వం ఏడుగురిని నియమించాలని ప్రతిపాదించింది. వారిలో కప్పర హరిప్రసాద్, వైష్ణవి, కేఎల్‌ఎన్ ప్రసాద్, రాములు ఉన్నారు. దీనికి సంబంధించిన ఫైలును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పంపించింది. ఏ కారణాల వల్లనో గవర్నర్ ముగ్గురిని కాకుండా నలుగురి పేర్లను మాత్రమే ఖరారు చేసింది.
సీఎంగా పదవీ బాధ్యతలు తీసుకోకముందు రేవంత్ రెడ్డి ఒక విషయానికి సంబంధించి ఆర్టీఐ ఆఫీసులో దరఖాస్తు చేసుకున్నారు. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు ప్రైవేటు లీజుకు సంబంధించి గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పంద వివరాలు అందించాలని టీపీసీసీగా ఉన్న రేవంత్ అడిగారు. ఒక పౌరుడిగా ఎంపీ, టీపీపీసీ అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సమాచార హక్కు చట్టం కింద హెచ్‌ఎండీఏకు ఈ దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు స్పందించలేదు, దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తాము అధికారంలోకి వస్తే సమాచార హక్కు చట్టాన్ని రాష్ట్రంలో పక్కా అమలు చేస్తామని రేవంత్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి చాలా హామీలు ఇచ్చారు. కానీ రేవంత్ అధికారం చేపట్టి ఏడాది పూర్తయినా సమాచార కమిషన్ నియామకం జరగలేదు. జనవరి 2025లో కూడా దీని మీద రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం స్పందించలేదు.
నిర్దిష్ట సమయంలోగా ఖాళీగా ఉన్న సమాచార కమిషనర్ పోస్టులను భర్తీ చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని చాలా కాలం కిందటే ఆదేశించింది. దీనికి సంబంధించి 2023 జూన్‌లో నోటిఫికేషన్ను జారీ చేసింది. 2023 డిసెంబరులో ప్రభుత్వం మారడం, తర్వాత మళ్లీ సాధారణ ఎన్నికల నేపథ్యంలో నియామక ప్రక్రియ ఆలస్యమైంది. అయితే, ఓ ప్రధాన కమిషనర్, ఆరుగుర కమిషనర్ల నియామకానికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం గత జూన్‌లో మళ్లీ నోటిఫికేషన్ జారీ చేసింది. రాజకీయ జోక్యం లేకుండా నియామకాలు జరగాలని సీఎం బ్రహ్మాండంగా ఆదేశించారు. ఇందులో భాగంగా ఓ జాబితాను సిద్ధం చేశారు. అంతేకాకుండా ఇంటెలిజెన్స్ విచారణ కూడా మొదలుపెట్టారు. చివరాఖరికి కమిషన్ ఏర్పాటు, కమిషనర్ల నియామకం జరిగింది. ఇప్పుడైనా ప్రజల దరఖాస్తులకు స్పందన లభిస్తుందో లేదో వేచి చూడాలి. అయితే, ఆంధ్రప్రదేశ్లో కూడా కమిషనర్‌ల నియామకాల విషయంలో పురోగతి కనబడడం లేదు. సమాచార కమిషన్ నియామకాల అంశంపై సుప్రీంకోర్టు గతంలో మరోసారి ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నియామక ప్రక్రియను ప్రారంభించామని, త్వరలో పూర్తి చేస్తామని ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది