కల్వకుర్తి నవంబర్ 24 (ఈతరం భారతం);ప్రభుత్వాలు శాశ్వతం కాదని.. రాజ్యాంగానికి లోబడి విధులు నిర్వహించాలని పోలీసులకు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ హితవు పలికారు. సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పాంకుంట్ల సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని ప్రవీణ్‌కుమార్ అన్నారు. నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ దవాఖాన మార్చురీలో ఉన్న సాయిరెడ్డి భౌతిక కాయానికి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ నివాళులర్పించారు. సాయిరెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు.అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. తన చావుకు సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్ కారణమని సాయిరెడ్డి తన సూసైడ్ నోట్లో పేర్కొన్నారని తెలిపారు. అయినప్పటికీ పోలీసులు 108 బీఎన్ఎస్ కింద కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. సీఎం బద్రర్స్ రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సాయిరెడ్డి మృతికి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్యాయానికి గురైన వారి తరఫున బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.