EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

మాదకద్రవ్యాలను అరికట్టడం అందరి బాధ్యత  … తిరుమలగిరి ట్రాఫిక్ ఏసిపి జి శంకర్ రాజు 

ఈతరం భారతం సికింద్రాబాద్: జూన్ 28

మానవ అభివృద్ధి నిరోధకంగా మారిన మాదకద్రవ్యాల రవాణాను, వినియోగాన్ని అరికట్టడం పౌర సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి గురుతర బాధ్యత అని తిరుమలగిరి ట్రాఫిక్ ఏసిపి జి శంకర్ రాజు అన్నారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కళాశాలలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ లో ఆదివారం మాదకద్రవ్యాల నివారణ అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన విద్యార్థి అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. స్టడీ సెంటర్ కు చెందిన పిజిడిహెచ్ఆర్ డిప్లమా, జర్నలిజం విద్యార్థులు సంయుక్తంగా ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల జరిగే అనర్ధాలను వివరిస్తూ రూపొందించిన వీడియోలను ప్రదర్శించి విశ్లేషణాత్మకమైన వివరణ ఇస్తూ ఏసిపి శంకర్ రాజు ప్రేరణాత్మకమైన ప్రసంగాన్ని విద్యార్థులకు అందించారు. మాదకద్రవ్యాల వ్యతిరేకంగా రాసిన గీతాన్ని స్వయంగా పాడి వినిపించారు. ఉజ్వల భవిష్యత్తు పొందాల్సిన యువతరం, విద్యార్థులు మాదకద్రవ్యాలకు బానిసలై కన్నవారికి కంటి శోకాన్ని మిగిల్చడం బాధాకరమని ఆయన చెప్పారు.

దేశ సంపద లాంటి యువతరాన్ని, విద్యార్థులను కాపాడుకునేందుకు అందరూ ఐక్యంగా మాదకద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ముందు జాగ్రత్త చర్యలతో కొత్త తరాన్ని ఆ వ్యసనానికి బానిసలు కాకుండా చూడాలని తల్లిదండ్రులు, పౌర సమాజానికి ఆయన విజ్ఞప్తి చేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎస్ ఎస్ బి డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విస్తరించిన భూతంలా తయారవుతూ మానవ మనుగడకే సవాల్ గా మారిన మాదకద్రవ్యాలను అరికట్టడంలో వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని అన్నారు. ప్రతి విద్యార్థి మాదకద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. విద్యార్థుల ప్రశ్నలకు ఏసీబీ శంకర్ రాజు సమాధానాలు ఇస్తూ మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞను చేయించారు.

కార్యక్రమంలో అకాడమిక్ కౌన్సిలర్లు దునుకు వేలాద్రి, బాబ్జి, రామస్వామి, ఆలేటి రామచందర్, షేక్ సమీర్ తో పాటు రాజ్యలక్ష్మి, కార్యాలయ సిబ్బంది సతీష్, కాంచన, పీజీ డి హెచ్ ఆర్ విద్యార్థులు కంఠం సైదులు, తులసి కుమార్,శేఖర్, వనమాల అనిత తోపాటు తండు శివుడుగౌడ్, డాక్టర్ ముంజాల రాజేందర్, స్టడీ సెంటర్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top