ఈతరం భారతం ఆరోగ్యాంశం (మహేశుని లక్ష్మయ్య) హైద్రాబాద్ మే 7:
లీటర్ల కొద్ది రక్తం తాగే వ్యాధి అది.. బాల్యాని చిదిమేస్తూ, నేడు ప్రపంచాన్ని వనికిస్తుంది. నయం చేసేందుకు ఇప్పటివరకు మందులు లేకపోగా… ప్రతి 20 రోజులకు ఒకసారి చొప్పున జీవితాంతం రక్తం ఎక్కించాల్సిన భయంకరమైన వ్యాధి తలసేమియా. నేడు ప్రపంచ తలసేమియా దినోత్సవ సందర్భంగా కొడంగల్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ లిల్లీ మేరి తో ప్రత్యేక కథనం
సముద్రానికి వచ్చే రక్తహీనత:
ఈ వ్యాధి బాధిత చిన్నారులకు ప్రతి 20 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. సకాలంలో రక్తం ఎక్కించకుంటే ప్రాణాలకు ముప్పు తప్పదు. గ్రీకు భాషలో తలసా అంటే సముద్రము, హీమ అంటే రక్తము. ఈ రెండు కలిపి తలసేమియా లేదా తలసీమియా అంటారు. సముద్రానికి వచ్చే రక్తహీనత దీని అర్థము. మొదటగా గ్రీసు, ఇటలీ, మధ్యధరా సముద్రంలో ఉండే కొన్ని దేశాలలో ఈ వ్యాధిని గుర్తించారు. కాలక్రమేనా ఆసియాలోని అనేక దేశాలలో ఈ వ్యాధి ప్రబలుతుంది. బిడ్డ పుట్టుకతోనే వచ్చే వ్యాధి. దీని నివారణకు ఇప్పటి వరకు మందులు కనిపెట్టలేదు. కేవలం ప్రతి రెండు మూడు వారాలకోసారి వ్యాధిగ్రస్తులకు రక్తం ఎక్కించడం ఒకటే మార్గం. దీంతో రెడ్ క్రాస్ సొసైటీ, తలసేమియా సొసైటీలు వ్యాధిగ్రస్తులకు ఎప్పటికప్పుడు శుద్ధి చేసిన రక్తం అందించేందుకు తమ వంతు తోడ్పాటును అందిస్తున్నాయి. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం వైద్య రంగాన్ని మరింత వణికిస్తుంది. అంతేకాకుండా వ్యాధి మొదటి దశలో గుర్తించడం కష్టమే. సకాలంలో రక్తం లభించక వ్యాధి బాధితుల కుటుంబ సభ్యులు పడరాని పాట్లు పడుతున్నారు. దాతల కోసం ప్రసారమాధ్యమాల్లో ప్రకటనలు సైతం ఇస్తున్నారు అని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ లిల్లీ మేరి పేర్కొన్నారు.
తల సేమియా అంటే:
తలసేమియా రెండు రకాలు. ఒకటి తలసేమియా మైనర్, రెండోది తలసేమియా మేజర్. మైనర్ అంటే కొంతమేరకు రక్తహీనత తప్ప మరో ఇబ్బంది ఉండదు. తలసేమియా మేజర్ ప్రాణాంతకమని చెప్పవచ్చు. వీరికి ప్రతి రెండు మూడు వారాలకోసారి రక్తం ఎక్కించాల్సిందే. లేని ఎడల వారు ప్రాణాలు కోల్పోతారు. తలసేమియా మైనర్ బాధిత దంపతులకు జన్మించే పిల్లల్లో 25% తలసేమియా మేజర్ వ్యాధిగ్రస్తులు అయ్యే అవకాశం ఉన్నట్లు అనేక సర్వేలు చెబుతున్నాయి. సాధారణ మనుషుల్లో ఏర్పడే రక్త కణాలు ఒక్కొక్కటి 120 రోజుల వరకు బ్రతికి ఉంటాయి. తలసేమియా మేజర్తో బాధపడే వారిలో రక్త కణాలు 21 రోజులకే చనిపోతాయి. ఇదే వారిలోని ప్రధాన సమస్య. ఈ సమస్యను అధిగమించేందుకు వారికి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. తలసేమియా మేజర్ బాధిత ఆరువారాల నుండి 12 నెలల్లో పిల్లలు పాలిపోయినట్లుగా ఉండటం, అలసటగా కనిపించటం, ప్లీహం పెరగటం ఈ వ్యాధి లక్షణాలు. తలసేమియా వ్యాధి గల పిల్లలు ఎక్కువగా ఏడవటం, తరచుగా వాంతులు, విరోచనాలు, జ్వరంతో బాధపడుతుంటారు. ఈ పరిస్థితుల్లో వారికి రక్త పరీక్షలు చేయించాలి. వ్యాధి ఉన్నట్లు తేలితే వారికి ప్రతి మూడు వారాలకోసారి హిమోగ్లోబిన్ 10 గ్రాములకు పైగా ఉండే ఎర్ర రక్త కణాలు ఎక్కించాలి. నిరంతరం ఎర్ర రక్త కణాలు ఎక్కించడం ద్వారా వ్యాధిగ్రస్తులు శరీరంలో ఐరన్ నిల్వలు పెరుగుతాయి. 20 సార్లు ఎర్ర రక్త కణాలు ఎక్కించిన తర్వాత శరీరంలో అధికంగా చేరినటువంటి ఐరన్ నిల్వలను తగ్గించేందుకు ఐరన్ చిలేషన్ థెరపీ చేయించాల్సి ఉంటుంది. వీరికి తరచుగా హెపటైటిస్ బి, సి, హెచ్ ఐ వి స్క్రీనింగ్, పెరేటివ్ లెవెల్, సీరం ,కాల్షియం, ఫాస్ఫరస్ పరీక్షలు చేయిస్తుండాలి. అలాగే డెంటల్ చెక్ అప్, కార్డియాక్ చెకప్, ఎండోక్రిన్ ఫంక్షన్ టెస్టులు కూడా చేయించాల్సి ఉంటుంది అని ప్రొఫెసర్ లిల్లీ మేరి తెలిపారు
బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ తో నయం:
తలసేమియా బాధిత రక్తం గ్రూపు ఉన్నటువంటి దాతలు లభిస్తే బోన్ మ్యారో (ఎముక మజ్జ) ట్రాన్స్ ప్లాంటేషన్ తో ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. ఈ సర్జరీకి లక్షల్లో ఖర్చవుతుంది. కొన్ని కార్పొరేట్ సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద దేశవ్యాప్తంగా బోన్ మ్యారో (ఎముక మజ్జ) ట్రాన్స్ ప్లాంటేషన్ మార్పిడి ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహిస్తున్నాయి.
పెరుగుతున్న బాధితులు:
ప్రతి ఏడాది తలసేమియా వ్యాధి బాధితుల సంఖ్య పెరుగుతుంది. ప్రపంచ జనాభాలో సుమారు 5శాతం మంది తలసేమియా బాదిన పడుతున్నారు. తలసీమియా తో దేశవ్యాప్తంగా 15 లక్షల మంది చిన్నారులు ఇబ్బంది పడుతున్నారని, దేశంలో ప్రతి ఏటా 10 నుంచి 12 వేల మంది చిన్నారులు ఈ వ్యాధితో జన్మిస్తున్నారు. ఇక తెలంగాణాలో సుమారు 2000 బాధితులు తమ పేర్లను వివిధ జిల్లాలలోని తలసేమియా సెంటర్ల యందు నమోదు చేసుకున్నట్లు సర్వే లెక్కలు చెబుతున్నాయి. తెలంగాణలోని రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రాలలో తలసేమియా సెంటర్ లను నిర్వహిస్తున్నాయి. వ్యాధిపై అవగాహన లేకపోవడంతో పేదలు తమ పిల్లలకు వైద్యం చేయించలేకపోతున్నారు.
రక్త సేకరణలో సొసైటీలు:
రెడ్ క్రాస్ సొసైటీ అటు తలసేమియా సొసైటీలు ప్రత్యేకంగా తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తం సకాలంలో అందించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఎప్పటికప్పుడు ఎంత మేరకు రక్తం అవసరం అనేది గుర్తించి రక్తదాతల నుండి రక్తమును సేకరిస్తున్నాయి. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాయి.
నిరంతర రక్త దానం:
వ్యాధి బారిన పడిన తమ పిల్లలకు పేదలు రక్తం కొనుగోలు చేయలేని పరిస్థితి. వీరి కోసం రెడ్ క్రాస్ సొసైటీ, అటు తలసేమియా సొసైటీలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి శిబిరాల ద్వారా రక్తాన్ని సేకరించి వారికి అందిస్తున్నాయి. ప్రధమ ప్రాధాన్యతగా తమ పరిధిలోని తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఎన్ని యూనిట్లు రక్తం అవసరం అనేది గుర్తించి ఎప్పటికప్పుడు ఉచితంగా అందజేస్తున్నారు. ఇందుకుగాను ఈ రెండు సంస్థలు తమ బ్లడ్ బ్యాంకుల్లో ఎప్పటికప్పుడు రక్తం నిల్వలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తల సేమియా వ్యాధితో బాధపడుతున్న వారందరికీ హైదరాబాదులోని రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రము, హనుమకొండ, మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్, కొత్తగూడెం, ఖమ్మం, మరియు మహబూబ్నగర్ రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రాలలోనూ మరియు తల సేమియా సొసైటీ రక్తనిధి లోనే రక్తం ఎక్కిస్తున్నారు.
“అవగాహనతోనే నివారణ” ప్రొఫెసర్ లిల్లీ మేరి
ఈ వ్యాధిని అరికట్టేందుకు ప్రజలు దీనిపై పూర్తిగా అవగాహన పెంచుకోవాలి. పుట్టే పిల్లలు తల సేమియా వ్యాధి బారిన పడకుండా కాపాడాలంటే పెళ్లికి ముందు యువతి యువకులు హెచ్బిఏ 2 లెవెల్ టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. భార్యాభర్తలు ఇరువురు జన్యు లోపంతో ఉంటే వారికి తల సేమియా వ్యాధితో పిల్లలు పుట్టే అవకాశం ఉంది. భార్యాభర్తల్లో ఒకరు జన్యు లోపాలతో ఉన్న సాధారణ వ్యక్తులను పెళ్లాడితే పిల్లలలో ఈ వ్యాధి రాకుండా అరికట్టవచ్చు. ఈ వ్యాధిని అరికట్టేందుకు రక్తపరీక్షలు చేయించుకోవాలి అని ప్రొఫెసర్ లిల్లీ మేరి తెలిపారు.



