ఈతరం భారతం తిరుపతి, జూన్ 29 రిపోర్టర్ మనోజ్ కుమార్
తిరుపతి పేరును దుర్వినియోగం చేస్తూ సోషల్ మీడియా వేదిక ఫేస్‌బుక్‌లో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అసభ్యకర, తప్పుడు ప్రకటనలు ప్రచారం చేస్తూ ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నట్లు తిరుపతి జిల్లా పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ ప్రచారంలో ఉన్న సమాచారం పూర్తిగా అవాస్తవం, నిరాధారమని జిల్లా పోలీస్ శాఖ స్పష్టం చేసింది. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాల మేరకు తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలు, పోస్టులపై సమగ్ర విచారణ చేపట్టాయి. సంబంధిత వ్యక్తులను గుర్తించి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇలాంటి నకిలీ ప్రకటనలను చూసి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని, వాటి ద్వారా ఎలాంటి లావాదేవీలు నిర్వహించవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద పోస్టులు లేదా ఖాతాలు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-112కు సమాచారం అందించాలని కోరారు. సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేసి ప్రజలను మోసగించే వ్యక్తులపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని, ఇలాంటి నేరాలను అరికట్టేందుకు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తోందని అధికారులు స్పష్టం చేశారు.















