ఈతరం భారతం హైదరాబాద్ జూన్ 29
హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులకు ట్రాఫిక్ పోలీసులు బిగ్ అలర్ట్ ఇచ్చారు. గచ్చిబౌలి-డీఎల్ఎఫ్ రోడ్డును 3 నెలల పాటు మూసివేయనున్నట్లు ప్రకటించారు. ఆ మార్గంలో ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే గచ్చిబౌలి-డీఎల్ఎఫ్ మార్గంలో వెళ్లే వాహనదారుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ట్రాఫిక్ మళ్లింపులను వాహనదారులు గమనించాలని సూచించారు.
హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయి. విశ్వనగరంగా ఎదుగుతున్న క్రమంలో జనాభా పెరిగిపోవడం, వారికి అనుగుణంగా వాహనాల సంఖ్య పెరగడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలోనే ఎన్నో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, స్కైవేలు నిర్మిస్తున్నారు. నగరంలో ట్రాఫిక్‌ను తగ్గించేందుకు కావాల్సిన అన్ని చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద మల్టీ లెవల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ పనులను మరింత వేగంగా పూర్తి చేసేందుకు ఆ రోడ్డును అధికారులు 3 నెలల పాటు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని గచ్చిబౌలి-డీఎల్ఎఫ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలో ప్రయాణించే వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కీలక అడ్వైజరీ జారీ చేశారు. ట్రిపుల్ఐటీ జంక్షన్ ఫ్లైఓవర్ పనుల కారణంగా 90 రోజుల పాటు ఆ రోడ్డు మూసివేయనున్నట్లు వెల్లడించారు. గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మల్టీ లెవల్ ఫ్లైఓవర్.. అండర్‌పాస్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతుండగా.. ఆ పనులను మరింత వేగంగా పూర్తి చేసేందుకు.. డీఎల్ఎఫ్ గేట్ నంబర్ 1 నుంచి గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వరకు ఉన్న రోడ్డును పూర్తిగా మూసివేయనున్నారు. జూలై 1వ తేదీ నుంచి 3 నెలల పాటు ఆ రోడ్డు మూసి ఉంటుందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.















