ఆన్లైన్లో కూతురు పెళ్లి..
టీవీపై అక్షింతలు చల్లి తల్లిదండ్రుల ఆశీర్వాదం
అమెరికాలో ప్రేమ వివాహం..
స్క్రీన్‌పైనే ఆశీర్వచనాలు.. ఊళ్లో ఘనంగా విందు
ఈ తరం భారతం సూర్యాపేట ఆగస్టు 30 ఆదివారం:
టెక్నాలజీ ఎంతగా విస్తరించిందో చెప్పడానికి, సప్త సముద్రాలు అవతల వైపు ఉన్న వారిని కూడా అది క్షణాల్లో దగ్గర చేయగలదని నిరూపించడానికి సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకున్న ఘటన సాక్ష్యంగా నిలిచింది.
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం వేపలసింగారం గ్రామానికి చెందిన జయరాజు, జ్యోతి దంపతులకు హిమబిందు ఏకైక కుమార్తె. ఆమె ఉన్నత చదువుల అనంతరం అమెరికాలో ఉద్యోగం చేస్తోంది. ఉద్యోగ రీత్యా అక్కడే పరిచయమైన ఎన్టీఆర్ జిల్లాకు చెందిన రోహిత్ కుమార్‌తో హిమబిందు ప్రేమలో పడింది. ఇరు కుటుంబాల పెద్దలు వీరి ప్రేమను అంగీకరించడంతో శుక్రవారం రాత్రి అమెరికాలో వీరి వివాహం ఘనంగా జరిగింది
కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల అమెరికా వెళ్లలేకపోయిన తల్లిదండ్రులు జయరాజు, జ్యోతి దంపతులు వేపలసింగారంలోనే ఉంటూ వివాహ వేడుకను ఆన్లైన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించారు. కుమార్తె తాళి కట్టించుకునే శుభ ముహూర్తంలో ఆన్లైన్ స్క్రీన్‌పైనే అక్షింతలు చల్లి తమ ఆశీస్సులను అందజేశారు. అనంతరం తమ ఏకైక కుమార్తె పెళ్లి వేడుకను పురస్కరించుకుని గ్రామంలో బంధుమిత్ర పరివారం, గ్రామస్థులకు అత్యంత వైభవంగా పెళ్లి విందు ఏర్పాటు చేశారు. ఆన్లైన్లో పెళ్లి చూస్తూ తల్లిదండ్రులు ఆశీర్వదించిన తీరు స్థానికంగా తీవ్రంగా ఆకట్టుకుంది.















