ఈతరం భారతం ఓవర్సీస్ న్యూస్ సెప్టెంబర్ 11
_____________________________________
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భేటీ అయ్యారు. ఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 12-13 తేదీలలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జరగనుంది._ఇందుకోసం పుతిన్ ఈరోజు (సెప్టెంబర్ 11) తెల్లవారుజామున న్యూఢిల్లీ చేరుకున్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ముందుగా వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. దాదాపు 45 నిమిషాల పాటు మోదీ, పుతిన్ల సమావేశం సాగింది. ఈ సమావేశంలో ఇరుదేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన, పారిశ్రామిక సహకారంతో సహా ద్వైపాక్షిక ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు నాయకులు చర్చించినట్టుగా తెలుస్తోంది.
సంబంధిత వర్గాల ప్రకారం… ఇరుదేశాల మధ్య పారిశ్రామిక సహకారాన్ని విస్తరించే మార్గాలపై మోదీ, పుతిన్లు ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తోంది. సెప్టెంబర్ 9 నుంచి 11 వరకు భారతదేశంలో మొదటిసారిగా జరిగిన రష్యా అంతర్జాతీయ పారిశ్రామిక ప్రదర్శన “ఇన్నోప్రోమ్ ఇండియా”ను వారు స్వాగతించారు. వాణిజ్య, పారిశ్రామిక సంబంధాలను మరింత విస్తరించడంలో దాని ప్రాముఖ్యతను మోదీ, పుతిన్లు నొక్కి చెప్పారు. ఇద్దరు నాయకులు ఇన్నోప్రోమ్ ఇండియా ప్రదర్శనను కూడా సందర్శించి, అక్కడ పాల్గొన్నవారితో ముచ్చటించారు.
బ్రిక్స్ కూటమిలో భారత్-రష్యా భాగస్వామ్యంపై నాయకులు తమ అభిప్రాయాలను మోదీ, పుతిన్లు పంచుకున్నారు. పశ్చిమ ఆసియా , నల్ల సముద్ర ప్రాంతంలో సముద్ర వాణిజ్యం, భారతీయ నావికుల భద్రతపై ప్రభావం చూపిన సంఘర్షణలతో సహా, పరస్పర ఆసక్తి ఉన్న కీలక ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై కూడా వారు తమ దృక్కోణాలను షేర్ చేశారు._
భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో కూడా గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తూ నిలదొక్కుకుంటున్న ఇరు దేశాల మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ప్రయత్నంలో నిమగ్నమై ఉండటానికి ఇరువురు నాయకులు అంగీకరించారు.సివిల్ న్యూక్లియర్ సహకారం అజెండాలోని మరో కీలక అంశంగా ఉన్నట్టుగా సమాచారం. రష్యాలో నైపుణ్యం కలిగిన భారతీయ కార్మికుల రాకపోకలను విస్తరించడం, వారి ఉనికిని పెంచడంపై కూడా ఇరుపక్షాలు చర్చించినట్టుగా సంబంధిత వర్గాలు తెలిపాయి.ఇక, 24వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు రష్యాను సందర్శించాలని ప్రధాని మోదీని పుతిన్ ఆహ్వానించారు. ప్రధాని మోదీ ఆ ఆహ్వానాన్ని అంగీకరించారు. దౌత్య మార్గాల ద్వారా పరస్పర సౌలభ్యం మేరకు శిఖరాగ్ర సమావేశ తేదీలను నిర్ణయించనున్నారు._
ఇదిలాఉంటే, మోదీ, పుతిన్ల మధ్య ఈ ఏడాది జరిగిన రెండో సమావేశం ఇది. మోదీ, పుతిన్లు అంతకుముందు 2026 ఆగస్టు 31న బిష్కెక్లో జరిగిన 26వ ఎస్సీవో శిఖరాగ్ర సమావేశం సందర్భంగా సమావేశమయ్యారు._















