ఈతరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 11
__________________________________
హోటళ్లు, దాబాలు, రోడ్డు పక్కన ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో పన్నీర్ బట్టర్ మసాలా, పన్నీర్ టిక్కా, పన్నీర్ ఫ్రైడ్ రైస్ అంటూ లొట్టలేసుకుని లాగించేస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. మనం ఎంతో ఇష్టంగా తినే పన్నీర్ నిజంగా పాలతోనే తయారవుతోందా? లేక రసాయనాలు, పామాయిల్ మిశ్రమమా? మార్కెట్లో విచ్చలవిడిగా సాగుతున్న ఈ కల్తీ దందాపై తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు ఉక్కుపాదం మోపింది. రాష్ట్రవ్యాప్తంగా నాన్-డైరీ, కృత్రిమ (అనలాగ్) పన్నీర్‌ను పూర్తిగా బంద్ చేస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కృత్రిమ పన్నీర్ తయారీ, ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వ, రవాణా మరియు విక్రయాలపై ఏడాది పాటు నిషేధం విధిస్తూ రాష్ట్ర ఆహార భద్రతా శాఖ కమిషనర్ గురువారం (సెప్టెంబర్ 10) అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం-2006 (FSSAI) లోని సెక్షన్ 30(2)(ఎ) ప్రకారం ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని గెజిట్‌లో స్పష్టం చేశారు.
నిజమైన పన్నీర్‌ను ఆవు లేదా గేదె పాలతో తయారు చేస్తారు. దీనికి ఖర్చు, సమయం ఎక్కువ. అయితే మార్కెట్లో కొందరు వ్యాపారులు అధిక లాభార్జనే ధ్యేయంగా పాల చుక్క కూడా లేకుండా.. పామాయిల్, ఇతర చౌకైన వెజిటబుల్ ఫ్యాట్స్, స్టార్చ్ (పిండి పదార్థాలు), రసాయనాలు కలిపి అచ్చం పన్నీర్‌లా కనిపించే ముక్కలను తయారు చేస్తున్నారు. దీనినే సాంకేతిక పరిభాషలో ‘అనలాగ్ పన్నీర్’ లేదా ‘నాన్-డైరీ పన్నీర్’ అంటారు.
చూడటానికి, రుచికి ఇది అచ్చం డెయిరీ పన్నీర్‌లాగే ఉండటంతో సామాన్య ప్రజలు తేడాను గుర్తించలేకపోతున్నారు. మార్కెట్లో అసలు పన్నీర్ కంటే ఇది చాలా తక్కువ ధరకు లభిస్తుండటంతో ఎక్కువ శాతం రెస్టారెంట్లు, బేకరీలు, ఫుడ్ కోర్టులు వీటినే వాడుతున్నాయి. ఈ తరహా కల్తీ పన్నీర్‌ను నిరంతరం తినడం వల్ల గుండె జబ్బులు, కాలేయ సమస్యలు, జీర్ణకోశ వ్యాధులు మరియు శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగి ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆహార నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.
రాష్ట్రంలో ఎవరైనా ఈ ఉత్తర్వులను ఉల్లంఘించి అనలాగ్ పన్నీర్‌ను తయారు చేసినా, హోటళ్లకు సరఫరా చేసినా లేదా విక్రయించినా ఆహార భద్రతా చట్టం ప్రకారం కఠినమైన క్రిమినల్ చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. అయితే ఆహార భద్రతా ప్రమాణాలకు లోబడి, నిబంధనల ప్రకారం చట్టబద్ధంగా తయారయ్యే అసలైన పాల (డెయిరీ) పన్నీర్ ఉత్పత్తులకు ఈ నిషేధం వర్తించదని అధికారులు స్పష్టం చేశారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో కల్తీ రాయుళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ఆహార భద్రతా టాస్క్‌ఫోర్స్ బృందాలు హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, గోదాములపై విస్తృతంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి.















