EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఏలకలు, వట్టివేరు, ఎండు ద్రాక్ష, బాదం–పిస్తా మాలలతో వేడుకగా స్నపన తిరుమంజనం

ఈతరం భారతం తిరుపతి సెప్టెంబరు 16 రిపోర్టర్ మనోజ్ కుమార్ :

__________________________________________________

శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి ఏలకలు, వట్టివేరు, ఎండు ద్రాక్ష, బాదం–పిస్తా తదితర సుగంధ ద్రవ్యాలతో రూపొందించిన విశేష మాలల మధ్య బుధవారం స్నపన తిరుమంజనం భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది.

తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు అర్చకస్వాములు వేద మంత్రోచ్ఛారణల నడుమ వైఖానస ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై ఆశీనులను చేసి, రంగురంగుల పుష్పాలతో సుందరంగా అలంకరించారు.ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు పాలు, పెరుగు, కొబ్బరినీళ్లు, తేనె, పసుపు, గంధంతో విశేష అభిషేకం చేశారు. శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో శాస్త్రోక్తంగా స్నపనం నిర్వహించారు.

స్నపన తిరుమంజనం సందర్భంగా ఉపనిషత్ మంత్రాలు, దశశాంతి మంత్రాలు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం తదితర పంచసూక్తాలను టీటీడీ వేద పారాయణదారులు భక్తిభావంతో పారాయణం చేశారు. అభిషేకానంతరం తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్లు వివిధ దివ్య పాశురాలను పఠించారు.

ఈ వేడుకలో భాగంగా ఏలకలు, వట్టివేరు, ఎండు ద్రాక్ష, నీలిరంగు పవిత్ర మాలలు, బాదం–పిస్తా మాలలు, పసుపు కొమ్ముల మాలలు, నందివర్ధనం–తామర మాలలు, రోజ్‌ పెటల్స్‌తో స్వామి, అమ్మవార్లను విశేషంగా అలంకరించారు.సుగంధ పరిమళాలు, వేదఘోషలు, భక్తి భావంతో రంగనాయకుల మండపం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, బోర్డు సభ్యురాలు శ్రీమతి సుచిత్ర ఎల్లా, ఇతర అధికారులు పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top