EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ప్రతి ప్రాంత సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోంది…రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

ఈతరం భారతం ఖమ్మం సెప్టెంబర్ 17 :

________________________________

ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఆవిష్కరించి జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క  ప్రసంగం

ఈతరం భారతం ఫాలోవర్స్ కోసం….

“జిల్లా ప్రజలందరికీ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. చరిత్రలో 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉంది. 77 సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ ప్రాంతం భారత దేశంలో అంతర్భాగంగా మారి, ప్రజాస్వామ్య ప్రజా పాలన దశలోకి పరివర్తన చెందింది. అందుకే ఈ సందర్భంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం.

స్వాతంత్ర్యం పొందిన సమయంలో దేశం రెండు రకాల పరిపాలన ప్రాంతాలుగా ఉండేది. బ్రిటీష్ వాళ్ళు ప్రత్యక్షంగా పరిపాలించిన బ్రిటీష్ ఇండియా ఒక భాగం. స్వదేశీ రాజుల పరిపాలనలో ఉన్న సంస్థానాలు రెండవ భాగం. గాంధీ నెలకొల్పిన సామరస్య విలువల వల్ల, జవహర్ లాల్ నెహ్రూ కల్పించిన విశ్వాసం వల్ల, మౌలానా అబుల్ కలాం ఆజాద్ పాదుకొల్పిన మతాతీత దేశభక్తి భావనల వల్ల, దేశానికి తొలి హోం మంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రదర్శించిన చాకచక్యం వల్ల సంస్థానాలు భారతదేశంలో కలిసిపోయి దేశం ఏకీకృతమైంది.

ప్రజాస్వామిక స్వేచ్ఛను పొందడం కోసం ఆనాటి యావత్ సమాజం ఉద్యమించింది. ఆనాటి అపూర్వ ఘట్టాలు జాతి జీవనంలో నిరంతరం సజీవంగా నిలిచిపోయాయి. నేటి సందర్భంలో ఆ ఉజ్వల ఘట్టాలను, ఆనాటి యోధుల వెలకట్టలేని త్యాగాలను తలుచు కోవడం మనందరి బాధ్యత.

తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం 1,000 రోజుల ప్రజా పాలనను పూర్తి చేసుకుంది. ఈ కాలంలో పేదలు, రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, వృద్ధులు, బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశాం. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ, కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ వంటి పథకాలతో ప్రజలకు అండగా నిలిచాం. అదే సమయంలో సాగునీరు, విద్యుత్, రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చాం. సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేస్తూ ప్రతి కుటుంబ సంక్షేమం, ప్రతి ప్రాంత సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఖమ్మం జిల్లాలో మహిళలు 6,39,31,602 ఉచితంగా ప్రయాణాలు చేసి రూ. 343.44 కోట్లను ఆదా చేసుకోగా, ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించింది.

మహాలక్ష్మి గ్యాస్ పథకం ద్వారా 245233 మంది లబ్ధిదారులకు 18,69,122 సిలిండర్లను రూ. 500 కే అందించాం. ఇందుకోసం ప్రభుత్వం 93 కోట్ల 45 లక్షల 61 వేల రూపాయల సబ్సిడీ భరించింది. గృహజ్యోతి ద్వారా 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే 2,49,454 కుటుంబాలకు రూ. 257.22 కోట్ల సబ్సిడీతో ఉచిత విద్యుత్ అందిస్తున్నాం.

మహాత్మా గాంధీజీ చెప్పినట్లుగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడితేనే దేశం బలపడుతుంది. అందుకే రైతు సంక్షేమానికి మా ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోంది. రైతు భరోసా ద్వారా ఖమ్మం జిల్లాలో 3,41,913 మంది రైతులకు రూ. 427.96 కోట్లు అందించాం. పంట రుణ మాఫీ ద్వారా 1,31,760 మంది రైతులకు రూ. 912.61 కోట్ల రుణభారం నుంచి విముక్తి కల్పించాం. రైతు బీమా ద్వారా 7,619 రైతు కుటుంబాలకు రూ. 380.95 కోట్లు అందించాం.

మొక్కజొన్నను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి 44,568 మంది రైతుల నుంచి 283956.397 మెట్రిక్ టన్నుల పంటను రూ. 681.49 కోట్ల విలువతో కొనుగోలు చేశాం. యాసంగి 2025–26 లో245 కొనుగోలు కేంద్రాల ద్వారా 20,085 మంది రైతుల నుంచి 14,62,411.60 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ. 346.82 కోట్లు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశాం.

తోటల సాగును ప్రోత్సహిస్తూ జిల్లాలో సుమారు 1,60,224 ఎకరాల్లో ఉద్యాన పంటలు, 48,168 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు జరుగుతోంది. 2026-27 సంవత్సరానికి గాను ఇప్పటి వరకు కొత్తగా 4,583 ఎకరాల ఆయిల్‌పామ్‌ సాగు చేపట్టి, రూ. 2.43 కోట్ల సబ్సిడీ ఇచ్చాం. రెండవ, మూడవ, నాల్గవ సంవత్సరం ఆయిల్ పాం తోటల నిర్వహణ మరియు అంతర పంటలకు గాను రూ. 8.08 కోట్ల సబ్సిడీ ఇవ్వడం జరిగింది. 3,862 ఎకరాల సూక్ష్మ నీటిపారుదలకు రూ. 6.50 కోట్ల సబ్సిడీ అందించాం.

వ్యవసాయానికి శాశ్వత భరోసాను కల్పించుటకు సాగునీటి ప్రాజెక్టుల పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. సీతారామ ఎత్తిపోతల పథకం, పాలేరు లింక్ కాలువ ద్వారా 1,38,790 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీటి వసతి, పాలేరు రిజర్వాయరు దిగువ నున్న నాగార్జున సాగర్ ఎడమ కాలువ, వైరా ప్రాజెక్ట్, లంకాసాగర్ ప్రాజెక్ట్ మరియు చిన్న నీటి వనరులలో నీటి లభ్యత తక్కువగా వున్నప్పుడు సాగునీరు సప్లిమెంట్ చేయుటకు నిర్మించబడుచున్నది.

మున్నేరు–పాలేరు లింక్ కాలువకు రూ. 107.651 కోట్లు, జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి రూ. 630.30 కోట్లు కేటాయించి పనులు కొనసాగిస్తున్నాం.

కొదుమూరు–వంధనం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా మొదటి దశ 2,500 ఎకరాలకు పనులు కార్యాచరణలో వున్నవి. రెండవ దశ ద్వారా మరో 2,500 ఎకరాలకు నీటిపారుదల సామర్థ్యాన్ని సృష్టించి, శాశ్వత నీటి వనరులు లేని కరువు పీడిత ప్రాంతాలలో ప్రధానంగా చిన్న మరియు సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూర్చనున్నాం.

మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా 2,412 ఎకరాలకు నీరు అందించేందుకు పంప్‌హౌస్, మోటార్ల ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేశాం. ఖమ్మం నగరాన్ని మున్నేరు వరదల నుంచి రక్షించేందుకు రూ. 525.36 కోట్లతో వరద రక్షణ గోడ నిర్మాణం కొనసాగుతోంది.

జిల్లాలో ప్రస్తుతం 126 సబ్‌స్టేషన్లు పని చేస్తుండగా, మరో 41 సబ్‌స్టేషన్లను మంజూరు చేశాం. ఖమ్మం నగరంలో రూ.6.5 కోట్లతో తొలి ఇండోర్ సబ్‌స్టేషన్‌ను మంజూరు చేశాం. రైతుల విద్యుత్ సమస్యలను పొలాల వద్దకే వెళ్లి పరిష్కరించేందుకు ‘పొలంబాట’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సేవల కోసం 6 విద్యుత్ అంబులెన్స్‌లు 24 గంటలు అందుబాటులో ఉన్నాయి.

వాతావరణ మార్పులను ఎదుర్కొంటూ తెలంగాణను హరిత ఇంధన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు 2030 నాటికి 20,000 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. ఖమ్మం జిల్లాలో రాజులపాలెంలో 1 మెగావాట్ సోలార్ ప్లాంట్ ప్రారంభమైంది. మరో ప్లాంట్ నిర్మాణంలో ఉంది.

27 మోడల్ సోలార్ గ్రామాల్లో రూఫ్‌టాప్ సోలార్, సౌర పంపుసెట్లను ఏర్పాటు చేస్తున్నాం. 379 ప్రభుత్వ పాఠశాలల్లో 1,768 కిలోవాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం. పీఎం–కుసుమ్ క్రింద 1,795 మెగావాట్ల సామర్థ్యానికి ఒప్పందాలు కుదిరాయి.

మహిళల స్వావలంభన కొరకు మహిళా స్వయం సహాయక సంఘాలను ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుతున్నాం. 4,008 సంఘాలకు రూ. 394.80 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు, 555 సంఘాలకు రూ. 16.36 కోట్ల స్త్రీనిధి రుణాలు, 52,059 సంఘాలకు రూ. 57.15 కోట్ల వడ్డీలేని రుణాలు అందించాం.

ఇందిరా మహిళా డెయిరీ ద్వారా మధిర నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో తొలి దశలో రూ.2 కోట్లతో 125 యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి లబ్ధిదారుకు రెండు పాడి గేదెలను అందిస్తూ మహిళలకు స్థిరమైన ఆదాయ మార్గాన్ని కల్పిస్తున్నాం.

మహిళా సంఘాల ద్వారా 67,976 మంది విద్యార్థులకు యూనిఫారాలు కుట్టించి పంపిణీ చేశాం. మహిళలను పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు, బస్సులు, డెయిరీ వంటి రంగాల్లో కూడా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నాం.

పేద కుటుంబాల్లో ఆహార భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఖమ్మం జిల్లాలో 4,73,271 రేషన్ కార్డుల ద్వారా 13,36,126 మంది లబ్ధిదారులకు 748 చౌకధరల దుకాణాల ద్వారా ప్రతి నెలా 2,43,59,342 కిలోల ఉచిత సన్నబియ్యం అందిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లోని 1,46,074 మంది విద్యార్థులకు నెలకు 445.420 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం సరఫరా చేస్తున్నాం.

ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కలను నిజం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల లక్ష్యం. ఖమ్మం జిల్లాలో తొలి దశలో 16,597 ఇళ్లు మంజూరు చేసి 11,427 ఇళ్లను పూర్తి చేశాం. లబ్ధిదారులకు రూ. 491.8 కోట్ల ఆర్థిక సహాయం అందించాం. రెండవ దశలో ఇప్పటివరకు 251 ఇళ్లు మంజూరుచేశాం.

తెలంగాణ భవిష్యత్తు మన పిల్లల చేతుల్లో ఉంది. అందుకే విద్యారంగాన్ని సమూలంగా బలోపేతం చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు అల్పాహార పథకం అమలు చేస్తున్నాం. గురుకులాలు, రెసిడెన్షియల్ సంస్థల కోసం ఆధునిక కేంద్రీకృత యాంత్రీకృత వంటశాలలను ఏర్పాటు చేస్తున్నాం. ఖమ్మం జిల్లాలో బడి బాట ద్వారా 66,882 మంది విద్యార్థుల నమోదు జరిగింది. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీలో ఖమ్మం జిల్లా రాష్ట్రం లో ప్రథమ స్థానంలో, పనితీరు గ్రేడింగ్ సూచీలో 5వ స్థానంలో నిలిచింది. జిల్లాలోని 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 5,989 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ ఏడాది అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉచిత అల్పాహారం అందిస్తున్నాం.

ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి నియోజక వర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను రూ.200 కోట్ల చొప్పున ఏర్పాటు చేస్తున్నాం. ఖమ్మంలో ప్రభుత్వ ఐటీఐ, మధిరలో మరో ప్రభుత్వ ఐటీఐ, ప్రభుత్వ పాలిటెక్నిక్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు, మధిరలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాం”

“ఆరోగ్య తెలంగాణ దిశగా రాజీవ్ ఆరోగ్యశ్రీని బలోపేతం చేస్తున్నాం. జిల్లాలో 26 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 అర్బన్ హెల్త్ సెంటర్లు, 9 బస్తీ దవాఖానాలు, 63 సబ్ సెంటర్లు, 161 ఆమ్ సెంటర్లు ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నాయి.

ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రూ.23.75 కోట్లతో నిర్మించుకున్న 50 పడకల క్రిటికల్ కేర్ భవనం పూర్తి చేసి ప్రారంభించుకున్నాం. ఆసుపత్రిలో సీటీ స్కాన్, 2డీ ఎకో, అల్ట్రాసౌండ్, వెంటిలేటర్లు, క్యాథ్ ల్యాబ్ వంటి ఆధునిక వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చాం.

వైరాలో రూ.37.50 కోట్లతో 100 పడకల ఏరియా ఆసుపత్రి, కూసుమంచిలో రూ.45.50 కోట్లతో 100 పడకల ఆసుపత్రి, తిరుమలాయపాలెం ఆసుపత్రిని రూ.26 కోట్లతో 100 పడకలకు అప్‌గ్రేడ్ చేస్తున్నాం.

ముదిగొండ, ఎర్రుపాలెంలో రూ.22 కోట్ల చొప్పున 50 పడకల ఆసుపత్రుల నిర్మాణం జరుగుతోంది. సత్తుపల్లి, చింతకానిలో కొత్త ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నాం. మధిరలో నర్సింగ్ కళాశాల, ఆసుపత్రి అదనపు పనులకు నిధులు కేటాయించాం.

ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మోకాలు, తుంటి మార్పిడి వంటి క్లిష్టమైన శస్త్ర చికిత్సలు కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నాం. డయాలసిస్ కేంద్రాలను విస్తరిస్తూ, నిపుణులైన వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని నియమిస్తున్నాం.

సామాజిక భద్రతలో భాగంగా 2026-27 లో చేయూత పింఛన్ల క్రింద 1,81,828 మంది లబ్ధిదారులకు రూ. 83.42 కోట్ల చేయూత అందించాం. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి ద్వారా 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటివరకు 13 మందికి రూ. 131.92 లక్షలు అందించాం. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం ద్వారా 1,329 మంది విద్యార్థులకు ప్రయోజనం కల్పించాం.

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల క్రింద ఆడపిల్ల వివాహాల నిమిత్తం ప్రభుత్వం 2026-27 సంవత్సరంలో ఇప్పటివరకు 1,154 మంది లబ్ధిదారులకు 11 కోట్ల 55 లక్షల 33 వేల 864 రూపాయలు పంపిణీ చేశాం.

బీసీ విద్యార్థుల కోసం జిల్లాలో 21 పాఠశాల వసతి గృహాలు, 11 కళాశాల వసతి గృహాలు పనిచేస్తున్నాయి. సుమారు 3,695 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ అందిస్తున్నాం. బీసీ స్టడీ సర్కిల్ ద్వారా పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తున్నాం.

గిరిజన సంక్షేమంలో 44 విద్యాసంస్థల్లో 5,004 మంది విద్యార్థులు విద్యనభ్య సిస్తున్నారు. 2025–26లో గిరిజన విద్యార్థుల పదవ తరగతి ఉత్తీర్ణత 94.92 శాతంగా, ఆశ్రమ పాఠశాలల్లో 96.57 శాతంగా నమోదైంది.

మహిళలు, చిన్నారుల సంక్షేమంలో జిల్లాలో 7 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,840 అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. బాల అమృతం, గుడ్లు, రోజువారీ పోషకాహారం, ఆరోగ్యలక్ష్మి ద్వారా గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నాం. దివ్యాంగులకు సహాయక పరికరాలు అందిస్తున్నాం.

నిర్మాణ కార్మికుల సంక్షేమంలో జిల్లాలో 2,41,823 మంది కార్మికులు నమోదు కాగా, ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 4,301 మంది కార్మికులకు రూ. 19.83 కోట్ల సంక్షేమ సహాయం అందించాం.

పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. జిల్లాలో 2025–26లో 35.32 లక్షల మొక్కల లక్ష్యానికి గాను 37.42 లక్షల మొక్కలు నాటాం. అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంరక్షణ కోసం చెక్‌డ్యామ్‌లు, పెర్కొలేషన్ ట్యాంకులు, సౌర పంపులు, నీటి కుంటలను ఏర్పాటు చేస్తున్నాం. గత మూడు సంవత్సరాల్లో 197.63 కిలోమీటర్ల ఫైర్‌లైన్లు ఏర్పాటు చేశాం.వెలుగుమట్ల, నీలాద్రి, పులిగుండాల ప్రాంతాల్లో ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం.

భూ రికార్డుల నవీకరణలో భాగంగా దాదాపు 96 సంవత్సరాల తర్వాత భూ రీ-సర్వే ప్రక్రియను ప్రజా ప్రభుత్వం ప్రారంభించింది. తెలంగాణ సర్వే అండ్ బౌండరీస్ చట్టం–1923 ప్రకారం జిల్లాలో దశలవారీగా రీ-సర్వే చేపడుతున్నాం.

తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో 3791.38 ఎకరాలు, సత్తుపల్లి మండలం బేతుపల్లిలో 11782.09 ఎకరాలు, కూసుమంచి మండలం భగవత్‌వీడులో 1258.17 ఎకరాల్లో రీ-సర్వే చేసి, రికార్డ్ తయారి ప్రక్రియ జరుగుతోంది. తదుపరి జిల్లాలో వివిధ మండలాలకు సంబంధించి 70 గ్రామాల్లో దశలవారీగా రీ-సర్వే చేపడుతున్నాం.

ప్రతి కుటుంబానికి సురక్షిత త్రాగునీరు అందించడమే మిషన్ భగీరథ లక్ష్యం. ఖమ్మం జిల్లాలోని 20 మండలాలు, 915 గ్రామాల్లో సురక్షిత త్రాగునీరు అందిస్తున్నాం. 1,408 ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్ల ద్వారా 24.88 లక్షలకు పైగా కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు అందుబాటులో ఉన్నాయి.

జిల్లాలోని 571 గ్రామపంచాయతీల్లో పారిశుద్ధ్యం, త్రాగునీరు, ఘన వ్యర్థాల నిర్వహణ, రోడ్లు, వీధి దీపాల వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా రూ.31.73 కోట్లతో పారిశుద్ధ్యం, వీధి దీపాలు, ఇతర మౌళిక వసతుల పనులు చేపట్టాం.

పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ ద్వారా ఉపాధి హామీ పథకం క్రింద 4,678 సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు రూ.201.76 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టి 3,550 పనులు పూర్తి చేశాం. గ్రామీణ రహదారులు, వంతెనలు, డ్రైనేజీలు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు వంటి మౌళిక వసతుల అభివృద్ధికి నిరంతరం నిధులు కేటాయిస్తున్నాం.

ఖమ్మం జిల్లాలో ఆర్‌అండ్‌బీ పరిధిలో 2,245.68 కిలోమీటర్ల రహదారులు ఉన్నాయి. మొత్తం రూ.4,706.52 కోట్ల విలువైన 218 పనులు చేపట్టాం. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ క్రింద 37 రహదారి పనులకు రూ.1,227.13 కోట్లు కేటాయించాం. మున్నేరు తీగల వంతెన నిర్మాణానికి రూ.180 కోట్లు కేటాయించాం.

కోదాడ–ఖమ్మం NH-365A నాలుగు వరుసల రహదారి నిర్మాణం రూ.1,583 కోట్లతో పూర్తయింది. ఖమ్మం–దేవరపల్లి జాతీయ రహదారి పనులు పూర్తి అయినాయి. ఈ రహదారులు గ్రామాలను మార్కెట్లతో, రైతులను పట్టణాలతో, యువతను ఉపాధి అవకాశాలతో అనుసంధానిస్తున్నాయి.

ఖమ్మం నగరంతో పాటు జిల్లాలోని మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అమృత్ పథకం క్రింద ఖమ్మం నగరానికి రూ.229.08 కోట్లతో త్రాగునీటి పనులు చేపట్టాం. 75,318 కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు, 25 నీటి నిల్వ ట్యాంకులను ఏర్పాటు చేశాం.

మధిర పట్టణంలో రూ.300 కోట్లకు పైగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. భూగర్భ మురుగునీటి వ్యవస్థ, శుద్ధి కేంద్రాలు, పైప్‌లైన్లు, రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు, వరద నియంత్రణ పనులు చేపట్టాం. వైరా, సత్తుపల్లి, కల్లూరు, ఏదూలాపురం, తదితర పట్టణాల్లో కూడా త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు, పారిశుద్ధ్యం, గృహ నిర్మాణం వంటి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నాం.

యువతకు ఉద్యోగం మాత్రమే కాకుండా నైపుణ్యం, స్వయం ఉపాధి, పారిశ్రామిక అవకాశాలు కల్పించడమే మా లక్ష్యం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టీ–ఐపాస్ ద్వారా 153 పరిశ్రమలకు సంబంధించిన 319 దరఖాస్తులు పరిశీలించి, రూ.577.74 కోట్ల పెట్టుబడులకు, 1,836 ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమం చేశాం.

టీ–ఐడియా, టీ–ప్రైడ్ ద్వారా 211 పరిశ్రమలకు రూ.18.02 కోట్ల ప్రోత్సాహకాలు అందించాం. పీఎంఈజీపీ ద్వారా 155 స్వయం ఉపాధి యూనిట్లకు రూ.5.50 కోట్ల సబ్సిడీ అందించి 575 మందికి ఉపాధి కల్పించాం. ఉపాధి కార్యాలయంలో 21,239 మంది నిరుద్యోగ యువత నమోదు చేసుకున్నారు. 17 జాబ్ మేళాల ద్వారా 203 మందికి ప్రైవేట్ ఉద్యోగాలు లభించాయి. నైపుణ్య శిక్షణ కేంద్రాల ద్వారా 1,918 మంది యువతకు శిక్షణ అందించాం.

జిల్లాలో ఖనిజ వనరుల వినియోగంతో వచ్చే ఆదాయాన్ని ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి వినియోగిస్తున్నాం. డీఎంఎఫ్‌టీ ద్వారా రూ.315.75 కోట్లతో గనుల ప్రభావిత ప్రాంతాల్లో మౌళిక వసతులు, విద్య, వైద్యం, త్రాగునీటి పనులకు నిధులు వినియోగిస్తున్నాం.

యువత శక్తిని సద్వినియోగం చేసేందుకు క్రీడా మౌళిక వసతులను బలోపేతం చేస్తున్నాం. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో రూ.8.50 కోట్లతో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, మధిరలో రూ.5.50 కోట్లతో మినీ స్టేడియం పనులు చేపట్టాం.

2025–26లో జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయిలో 24 పతకాలు, రాష్ట్ర స్థాయిలో 314 పతకాలు సాధించారు. ఇది మన జిల్లా యువత ప్రతిభకు నిదర్శనం.

ఖమ్మం జిల్లా అభివృద్ధికి నిరంతరం సహకరిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్‌చార్జి మంత్రివర్యులు, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార–పౌర సంబంధాల శాఖల మంత్రివర్యులు, రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత–జౌళి శాఖల మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, అమరవీరుల కుటుంబ సభ్యులు, కళాకారులు, న్యాయాధికారులు, పోలీస్ అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు నా హృదయ పూర్వక అభినందనలు. ప్రజా ప్రభుత్వ కార్యక్రమాలకు సహకరిస్తున్న ఖమ్మం జిల్లా ప్రజలందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు.ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు”

Related News

Select the Topic
Scroll to Top