ఈతరం భారతం సాహిత్యాంశం
‘ మానవత్వపు భావదీపిక…..’
———————-
తన ప్రత్యక్ష అనుభవంలోకి వచ్చిన సంఘటనాత్మక సందర్భోచిత విషయాల్ని బలీయమైన భావుకతతో, ప్రత్యేకమైన అభివ్యక్తితో అక్షరీకరిస్తే ఆ కవిలోని దార్శనికశక్తిని , దృష్టికోణపు తీక్షణతను స్పష్టంగా పాఠకులు అర్థం చేసుకుంటారు. లోతైన అవగాహనతో ఒక విషయాన్ని,సందర్భాన్ని కవితాత్మకంగా అంచనా వేసే స్థితి కవి సృజన దృష్టి కోణంలోని బలిమికి సాక్ష్యం అవుతుంది. కవి అంతరిక యానం లోంచి తరలివచ్చే కవిత్వంలో సామాజిక స్థితిగతులు, అస్తిత్వ సంక్షోభాలు సమాంతరంగా ప్రతిఫలిస్తాయి. కవిలోంచి తళుక్కుమని పుట్టే ఆశ లాంటి కవిత్వం చుట్టూరా దట్టంగా అల్లుకున్న చీకట్ల నిరాశల్ని తుడిచేసే రక్షణ కవచాలవుతాయి. నిరంతర చింతన లోంచి కాల లయను కాలిక స్పృహగా మలుచుకుని గాఢత గల ఎన్నో కవితల్ని రాసి పేరొందిన కవి సురేంద్ర రొడ్డ . ‘మరచిపోకుమా’ పేరుతో ఆయన వెలువరించిన 78 కవితల కవితా సంపుటిలో ఒక సౌందర్య దృష్టి, ఆది భౌతిక ఆనంద చింతన, తాత్విక స్పృహ, ఆత్మీయత, ఒకింత ఆందోళనాత్మక నిరసన, మరోవైపు నిమగ్నతతో కూడిన నిబద్ధత అల్లుకొని ఉంది.
‘దుఃఖంలో సుఖమున్నట్టు/ చావులో కూడా జీవితం ఉందేమో’ అని ఓ కవి అన్నట్టు విపత్కర కరోనా వైపరీత్యాన్ని చిత్రిస్తూ రాసిన ఈ సంపుటిలోని మొదటి కవిత ‘ మానవుడా మరిచిపోకు’ మానవ జీవన దైన్యానికి అద్దం పట్టింది. ‘మరణం మనకు శత్రువేమీ కాదు /మనతో పుట్టినడుస్తున్న తోబుట్టువే /మానవత్వాన్ని పూడ్చిపెట్టిన చోటునే/ మనిషిని మట్టుపెట్టే పురుగు పుట్టింది రా’ అని రాక్షసుడిగా మారిన మనిషిని మళ్లీ విలువలున్న మనిషిగా మారమని కరోనా ఒక బలమైన గుణపాఠం నేర్పి వెళ్లిందని రాశారు. ‘కాలుతున్న కమురువాసన’ తెలియాలంటే మనిషిలో ‘మానవత్వపు వాసన’ కాసింతైనా మిగిలి ఉండాలని చెప్పారు. ‘మనుషులు మిగలాలి కదా’ కవిత యుద్దోన్మాదానికి చరమగీతం పాడమన్నది. ‘అంతకు మునుపే’ కవిత వర్తమాన సమాజంలో ఆడపిల్లల అస్తిత్వ స్థితిని చూపించింది. లిపి లేని భాషలో చినుకుల మధ్య సాగిన ఊసుల్ని ‘అనువదిస్తే’ కవిత అక్షరీకరించింది. మంచితనమే ఆశీస్సుల పందిరవుతుందని ‘అమ్మ మనసు కుశాలవుతది’ కవిత చెప్పింది. బాల్యం ఆకలితో చిధ్రమవుతున్నదని కవి వేదన చెందారు. ‘ఒక నేను నీకు- పెక్కు నీవులు నాకు’ కవిత భాషకందని భావతరంగమైంది. ‘నీకు నేను లేనూ ‘అన్న మాటకు ఆత్మీయత, అవసరం, లాలన, ఓదార్పు,ఆప్త వాక్యం కన్నా గొప్పది అని కవి చెప్పారు. దాపరికం అంటూ ప్రత్యేకంగా ఎక్కడా ఏమీ ఉండదని జాగ్రత్తగా అవలోకిస్తే అంతా బహిరంగమేనని తెలిపారు. ‘కుళ్ళు వాసన’ కవిత జీవన విలువల ఆనవాళ్లు కోల్పోయే మనిషి అనాలోచిత ప్రవర్తనను తెలిపింది. ఆదమరిచి ప్రవర్తిస్తే ఆరడుగుల నేలకై వెతుకులాట తప్పదని పరోక్షంగా మనిషికి మరణ హెచ్చరిక చేశారు. కవి శిల్పిగా మారి గుండె నివేదనలను ఎంతో జాగ్రత్తగా కలం ఉలితో అక్షర తోరణాలుగా మలిచారు.
‘ కారు చీకట్లున్నా నువ్వెళ్ళే దారుల్లో చిరుదివ్వలు వెలిగించు’ అని చెప్పారు. ప్రాణదీపం ఏ క్షణంలో ఆరిపోయినా సంతసంగా వెళ్లడానికి సంసిద్ధం అయ్యేందుకు ప్రాణంతో ఉన్నప్పుడే అందరి మధ్య అరమరికలు లేని ఆనందమయమైన, అవ్యాజమైన ప్రేమతో బ్రతకాలి అన్నారు. సమాజ గాయానికి శస్త్ర చికిత్స తప్పదు అన్నారు. ‘ పద్దెం కన్నుల్లో పలికింది’ అన్న కవితలో కాలమార్పుతో ఏర్పడిన అనూహ్య జీవన పరిణామాల్ని లయాత్మకంగా వివరించారు. కళానిలయం, ఆమె అతడు,మన జీవన నాడి నాన్న, దేశం ఇచ్చిన దేహం,శిశిరానికి స్వాగతం కవితలు ఆత్మీయ,అనుబంధాల స్పర్శతో సాగాయి. ‘ఇంతకీ ఎవరతను’ కవిత వ్యక్తిత్వంతో కూడిన సామాజిక,దేశభక్తి ధర్మాన్ని ప్రబోధించింది . పీడితులు పోరాటంలో తోడు రాక ప్రతిసారి ‘నేనోడి పోతున్నాను’ అన్నారు. ‘తీరని దాహం’ కవిత బతుకు సారాన్ని ఎంత తాగినా సారా రాకాసి దాహం తీరనే తీరదని చెప్పింది. మనిషికి ‘నిర్వేదం’ వద్దని అన్నారు. సమతా మమతను ప్రపంచానికి పంచమని మనిషికి సూచించారు. జీవిత రంగస్థలంలో అందరూ మహానటులేనని అన్నారు. ‘గడియారంలోని సెకను ముల్లులా జీవిత వృత్తం చుట్టూ తిరుగుతున్న ఇల్లాలు’ అని గృహిణి కర్తవ్యం నిష్ఠను తెలిపారు. అమృత సింధువు, మాసిపోని జ్ఞాపకం, మరో శాపగ్రస్తుడు,తనో సాహితీవనం,కలం కళ్ళు, సాహితీ గమనం, నానీలు, మహిళలేని క్షణమేది, బంధాల సాక్షిగా,తీయటి వ్యధ,పాతాళభేరి, గడియారమే లేని లోకంలో, యుద్ధం,నీలా నీవు బతకలేవు,శిధిలాలయం, గుండె గగనంలో నక్షత్రం, అక్షర సేద్యం అన్న కవితలు వివేచనను మధించే విధంగా తీక్షణతతో సాగాయి.
మట్టిలో పుట్టి మట్టిలో కలిసే వరకు నేను మానవత్వాన్ని ధరించిన నిలువెత్తు రూపాన్ని అని ‘నేను మట్టి మనిషిని’ కవితలో చెప్పారు. ‘విశ్వశాంతికై ప్రతి ఒక్కరూ శ్వేతకపోతమై ఎగరాలి ‘అని తెలిపారు. ‘గెలుపెవరిది’ కవిత పేదరికం నుండి ప్రభవించిన అచంచల ఆత్మవిశ్వాసపు ఊపిరిని పరిచయం చేసింది. ఆధునికతతో కూడిన వ్యాపార యాంత్రికత ధాటికి పగిలిపోయిన పల్లె గుండెకు ప్రాణం పోసి అందులోని మునుపటి మమకారాలను బ్రతికించాలని చెప్పి తనలోని పల్లీయ ప్రేమను కవి ప్రకటించారు. ‘నీ వంటూ ఏమిటో నీ అంతరాత్మనే అడుగు తెలిసిపోతుంది అన్నారు. కన్నతల్లి కౌగిలిలా, అంతర్లోచనం ఒక క్షణం ఆలోచించు, పరోపకారులు, కమ్మటి కలలు, పెదవి దాటని ప్రశ్న,నాన్నకు నాన్నవ్వు, ఓ పూమాల,ఏ వేకువ వెన్నెలో, ఎప్పటికీ రుణగ్రస్తున్నే, అమ్మ వుంటే,అంకితం అన్న కవితా ఖండికలు విషయ నిర్దిష్టతతో, వర్తమాన స్పర్శతో ఆలోచింపజేస్తాయి. ‘నిష్క్రమణం అనివార్యమైనప్పుడు నిశ్శబ్దమే శరణ్యం ‘అని సూటిగా చెప్పారు. బ్రతికినన్నినాళ్ళు మానవత్వంతో బ్రతికి ఆ నలుగురిని సంపాదించుకో అని ‘ఆఖరి మజిలీ’ కవితలో అన్నారు. రెక్కల కష్టం రైతులదైతే చేతికొచ్చిన పంట దళారుల పాలయ్యిందని ‘ఎందుకో’ అన్న కవితలో వేదన చెందారు. సత్యమేదో తెలిశాక,నేను కవితా చెట్టునని, దారి దీపం, ఎందుకీ మౌనం, మళ్ళీ వస్తావు కదూ,ఇక సెలవా అన్న కవితలు భిన్న దృక్కోణాలను స్పర్శిస్తూ దార్శనిక భావాలను రేకెత్తిస్తాయి. ‘మానవత్వపు విత్తులు వేయాలి/ మనస్సున్న మనుషులు మొలకెత్తాలి ‘అని తన కవిత్వపు అచంచల, అమేయ ప్రగాఢాకాంక్షను కవి వ్యక్తపరిచారు. భావుకతనే శ్వాసగా, సాహిత్యాన్ని సమస్తంగా భావించే దృక్పథం కలిగిన ఈ కవి ఇదివరకే ‘నాన్న పచ్చి అబద్దాలకోరు’, ‘భావ తరంగాలు’, ‘అడవి మల్లి’ వంటి రచనలతో సాహితీ లోకంలో తనదైన ముద్ర వేశారు . ఇప్పుడు పాఠక ప్రపంచానికి అందిన ‘మరచిపోకుమా’ అన్న ఈ నాలుగో రచన కవి అంతరంగం ద్వారా అందిన అద్వితీయానుభూతుల బహుమతి.

సమీక్షకులు :
డా. తిరునగరి శ్రీనివాస్ 9441464764















