ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 10
__________________________________
అండాల సేకరణ ముసుగులో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న సంస్థలు, వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ దామోదర రాజనర్సింహ ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ గ్రూప్స్ (GO Rt No. 176 ప్రకారం రూపొందించిన) రాష్ట్రవ్యాప్తంగా ఐవీఎఫ్ కేంద్రాలపై ముమ్మర తనిఖీలు చేపడుతున్నాయి.
రాష్ట్రంలో గుర్తించిన మొత్తం 44 ఏఆర్టీ కేంద్రాలకు గాను ఇప్పటివరకు 27 కేంద్రాల్లో వైద్య అధికారులు తనిఖీలు పూర్తి చేశారు. ఈ తనిఖీల్లో ఏడు ఆసుపత్రుల్లో 13 నిబంధనల ఉల్లంఘనలను గుర్తించారు. ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలకు ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేశారు.మిగిలిన కేంద్రాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. పోలీసుల స్వాధీనంలో ఉన్న రికార్డులు, జాతీయ ఏఆర్టీ అండ్ సరోగసీ రిజిస్ట్రీ నుంచి అందే వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు చేపట్టనున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి పలువురు మహిళలను గుర్తించగా, వైద్యులు, ఐవీఎఫ్ కేంద్రాలు, మధ్యవర్తుల పాత్రపై విచారణ కొనసాగుతోంది.
ఈ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ జరిపేందుకు నవంబర్ 6న వైద్య అధికారులు న్యూఢిల్లీలోని నేషనల్ ఏఆర్టీ అండ్ సరోగసీ రిజిస్ట్రీని సందర్శించారు. తెలంగాణలో నమోదైన ఏఆర్టీ కేంద్రాలు, ఏఆర్టీ బ్యాంకులకు సంబంధించిన పూర్తి వివరాలను కోరారు.
అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) చట్టం–2021, దాని నిబంధనలకు విరుద్ధంగా మహిళల నుంచి అండాలను సేకరించడం శిక్షార్హమైన నేరమని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని అన్ని ఏఆర్టీ క్లినిక్లు, ఏఆర్టీ బ్యాంకులు తప్పనిసరిగా చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ పొందడంతోపాటు నిర్దేశించిన నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది.
మధ్యవర్తుల మాయమాటలు, ఆర్థిక ప్రలోభాలకు లోనై అక్రమ వైద్య విధానాలకు మహిళలు బలికావద్దని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. ఇలాంటి అక్రమ కార్యకలాపాలు ఎక్కడైనా జరుగుతున్నట్లు గుర్తిస్తే సంబంధిత జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.















