ఈతరం భారతం ఖమ్మం నవంబర్ 22:
ఖమ్మం నగరంలో ఓ ఫంక్షన్ హాల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా గందరగోళం చోటుచేసుకుంది. ఒకే హాల్‌ను ఒకే సమయంలో రెండు వర్గాలకు బుక్ చేసి నగదు వసూలు చేయడంతో ఇరువర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ కార్యక్రమాల నిర్వహణ కోసం వండకాలు సిద్ధం చేసుకుని ఫంక్షన్ హాల్‌కు చేరుకున్న ఓ వర్గానికి తీరా అక్కడ మరో కార్యక్రమం కూడా ఉండటంతో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది.
ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఓ ఫంక్షన్ హాల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. రమణగుట్ట ప్రాంతానికి చెందిన దేవత్ నరసింహ, పల్లవి దంపతుల రిసెప్షన్ కార్యక్రమం నిర్వహించేందుకు వారి కుటుంబ సభ్యులు ఫంక్షన్ హాల్ యాజమాన్యాన్ని సంప్రదించారు. ఆదివారం హాల్ ఖాళీగా ఉందని యాజమాన్యం చెప్పడంతో నగదు చెల్లించి బుకింగ్ ఖరారు చేసుకున్నట్లు బాధితులు తెలిపారు.
అయితే అదే సమయంలో మరో కార్యక్రమానికి కూడా ఫంక్షన్ హాల్‌ను కేటాయించడంతో రెండు వర్గాలు ఒకేసారి అక్కడికి చేరుకున్నాయి. దీంతో ఎవరి కార్యక్రమం నిర్వహించాలనే విషయంలో గందరగోళం నెలకొంది. ఇప్పటికే వంటకాలు సిద్ధం చేసుకుని వచ్చిన ఓ వర్గం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఫంక్షన్ హాల్ బుకింగ్ విషయంలో యాజమాన్యం కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు తీసుకుని బుకింగ్ ఖరారు చేసిన అనంతరం ఒకే సమయంలో రెండు కార్యక్రమాలకు ఎలా అనుమతించారని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా సంబంధిత యాజమాన్యాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని బాధితులు కోరుతున్నారు.















