భోపాల్ మార్చ్ 18 ఈతరం భారతం :
ఛార్జింగ్ పాయింట్ వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈవీ కారుకు మంటలు రాజుకున్నాయి. ఆ వాహనం నుంచి బిల్డింగ్‌కు మంటలు వ్యాపించాయి. ఒక ఇంట్లో ఉంచిన గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఈ నేపథ్యంలో మంటల్లో కాలిపోయి ఏడుగురు సజీవ దహనమయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర కాలిన గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ సంఘటన జరిగింది. బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇండోర్‌లోని బెంగాలీ స్క్వేర్ సమీపంలోని ఒక బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. పుగాలియా కుటుంబానికి చెందిన బిల్డింగ్ సెల్లార్లో ఉన్న ఎలక్ట్రిక్ వాహనం (ఈవీ) ఛార్జింగ్ పాయింట్ వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆ కారులో మంటలు చెలరేగాయి. నిమిషాల్లోనే మూడు అంతస్తుల నివాస భవనమంతా మంటలు వ్యాపించాయి.కాగా, ఆ బిల్డింగ్‌లోని ఒక ఇంట్లో 12కు పైగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను నిల్వ ఉంచారు. మంటలు వాటికి వ్యాపించాయి. సుమారు నాలుగు గ్యాస్ సిలిండర్లు వరుసగా పేలాయి. గ్యాస్ సిలిండర్ల పేలుడు ధాటికి ఆ ప్రాంతం స్వల్పంగా కంపించింది.పేలుళ్ల తీవ్రత వల్ల భవనంలో కొంత భాగం కూలిపోయింది. గ్యాస్ సిలిండర్ల పేలుళ్ల శబ్దానికి స్థానికులు భయాందోళన చెందారు.మరోవైపు మంటలు చెలరేగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆ ఇంట్లో ఉన్న ఎలక్ట్రిక్ డోర్ లాక్ అయ్యింది. ఈ నేపథ్యంలో సహాయక చర్యలు క్లిష్టమయ్యాయి. ఆ ఇంట్లో నివసించేవారు లోపల చిక్కుకుపోయారు. మంటల్లో కాలి ఏడుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ముగ్గురిని స్థానికులు కాపాడారు. కాలిన గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ అగ్ని ప్రమాదం గురించి తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఆ ఇంటికి వచ్చిన బంధువులు రాత్రివేళ అక్కడ బస చేసిన సమయంలో ఈ విషాదం జరిగింది. ఏడుగురు వ్యక్తులు సజీవ దహనమైనట్లు ఇండోర్ కలెక్టర్, ఎస్పీ తెలిపారు. సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు
.















