సిద్దిపేట (ఈతరం భారతం)
: జీర్ణాశయంలోని ఆమ్లము పైకి గొంతులోకి ఎగదనుకొని రావటం (జిఈఆర్ డి) తరచూ చూసేదే. అన్నవాహిక, జీర్ణాశయము కలిసే చోట బిగుతైన కండర వలయం వదులు కావటం దీనికి మూలం. వయస్సు మీద పడ్డవారు, ఉబ కాయలు గర్భిణులో జిఈఆర్ డి ఎక్కువ. ఇందులో ఛాతి మంట మాత్రమే కాదు, ఇతరాత్రా లక్షణాలు కనిపిస్తాయి అని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ లిల్లీ మేరి అన్నారు.జిఈఆర్ డి ప్రధాన లక్షణం కడుపు పై భాగాన, ఛాతీ మధ్యలో మంట పుట్టడం, ఇది పొడిచినట్టుగా నొప్పితో వేధిస్తుంది. కొన్నిసార్లు ఛాతీ ఎముక నుంచి గొంతు వరకు మంట ఎగబాకోచ్చు. ఏదైనా తిన్నప్పుడు, ముందుకు వంగినప్పుడు, పడుకున్నప్పుడు మంట ఎక్కువ అవుతూ ఉంటుంది. మరో ముఖ్య లక్షణం జీర్ణాశయంలోని పదార్థాలు అన్నవాహిక ద్వారా గొంతులోకి, నోట్లోకి రావడం చాలామంది పట్టించుకోరు. కానీ కొన్ని ఇతర లక్షణాలు ఈ ఆమ్ల సమస్యలో కనిపిస్తుంటాయి అని డాక్టర్ లిల్లీ మేరి పేర్కొన్నారు. వికారం, ముద్ద మింగటంలో ఇబ్బంది, ముద్ద కిందికి దిగినప్పుడు నొప్పి, తరచూ నోరు చేదుగా, పుల్లగా అనిపించడం, గొంతు బొంగురు పోవడం, గొంతు నొప్పి, ఛాతీ నొప్పి లేదా ఛాతీ బిగపట్టినట్టు అనిపించడం. కొందరు దీంతో రాత్రిపూట నిద్రలో నుంచి మేల్కొంటారు కూడా అని అసిస్టెంట్ ప్రొఫెసర్ లిల్లీ మేరి అన్నారు.
గుండె నొప్పి మాదిరిగాను:
ఛాతీ మంట కొన్నిసార్లు గుండెపో టును తలపిస్తుంది. గుండె నొప్పితో అత్యవసరంగా ఆసుపత్రికి వచ్చే వారిలో చాలామందిలో పరీక్షలు అనంతరం తీవ్ర ఆమ్ల సమస్యగా బయటపడుతుంది కూడా. ఈ రెండింటిలోనూ ఛాతీ మధ్యలో ఇబ్బంది కలుగుతుండటం గమనార్హం. అయితే ఛాతీ మంట చాలా వరకు ఎక్కువగా లేదా మసాలా పదార్థాలు తిన్న తర్వాత మొదలవుతుంది. అదే గుండెపోటు అయితే శారీరక శ్రమ, ఒత్తిడి అనంతరం తలెత్తుతుంది. ఏదేమైనా ఛాతిలో మంట, నొప్పిగా అనిపిస్తే దానికి కారణమేంటన్నది రూడీ చేసుకోవటం మంచిది .ఆమ్ల సమస్య అయితే ఇబ్బంది ఏమి ఉండదు. కానీ గుండెపోటుకు చికిత్స ఆలస్యం అయితే తీవ్ర అనర్థం కలగొచ్చు అని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ లిల్లీ మేరి పేర్కొన్నారు.
డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్లాలి?
ఛాతీలో మంటకు చాలామంది యాంటాసిడ్ మాత్రలు వేసుకోవటం, ఆహారంలో మార్పులు చేసుకోవడం చూస్తూనే ఉంటాము. వీటితో లక్షణాలు తగ్గకపోతే నిర్లక్ష్యం చేయొద్దు. ఛాతీలో నొప్పి, ఆకలి తగ్గటం, విడవకుండా వాంతి కావడం, మింగడంలో ఇబ్బంది, వాంతిలో రక్తం లేదా కాఫీ రంగు చారలు కనిపించడం మలంలో రక్తం పడటం, మలం నల్లగా రావడం, అనూహ్యంగా బరువు తగ్గటం వంటి లక్షణాలు కనిపిస్తే వీలైనంత త్వరగా డాక్టర్ను సంప్రదించాలని డాక్టర్ లిల్లీ మేరి తెలిపారు.







