న్యూయార్క్ ఏప్రిల్ 16 (ఈతరంభారతం ): డ్రాగన్ దేశం చైనాపై అగ్రరాజ్యం అమెరికా విరుచుకుపడింది. వాణిజ్య యుద్ధం నేపథ్యంలో మరోసారి పంజా విసిరింది. చైనా దిగుమతి వస్తువులపై సుంకాన్ని 245 శాతానికి అమెరికా పెంచేసింది. తమ వస్తువులపై ప్రతీకారంగా చైనా దిగుమతి సుంకాలు పెంచిన నేపథ్యంలో ఈ చర్యకు దిగినట్లు శ్వేతసౌధం వెల్లడించింది. అమెరికా ఫస్ట్ ట్రేడ్ పాలసీ విధానంలో భాగంగా .. ఇటీవల ట్రంప్ దిగుమతి సుంకాన్ని పెంచిన విషయం తెలిసిందే. చాలా వరకు దేశాలపై సుంకాన్ని ఆయన పెంచారు. కానీ చైనాపై మాత్రం ఆ పెంపు మరీ ఎక్కువగా ఉన్నది.అమెరికా దిగుమతి సుంకాన్ని పెంచిన నేపథ్యంలో.. రెండు రోజుల క్రితం చైనా కూడా కీలక నిర్ణయం తీసుకున్నది. అమెరికా సంస్థ బోయింగ్ ఉత్పత్తి చేస్తున్న విమానాలను ఖరీదు చేయవద్దు అని తమ దేశ ఎయిర్‌లైన్స్ సంస్థలకు చైనా ఆదేశించిన విషయం తెలిసిందే. బోయింగ్ సంస్థ నుంచి విడిభాగాలు కూడా కొనుగోలు చేయరాదు అని చైనా తమ దేశ ఎయిర్‌లైన్స్ సంస్థలకు చెప్పింది. ఈ ప్రకటన వెలుబడిన మరుసటి రోజే అమెరికా ప్రతీకార చర్యకు పాల్పడింది. చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాన్ని 245 శాతానికి పెంచినట్లు వైట్‌హౌజ్ పేర్కొన్నది
.