EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 1,50,000 Viewership

కార్యసిద్ధి కోసం గణపతి ఆరాధన

 శ్రీ గణాధిపతయే నమః

“తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని దలచిన పనిగా దలచితినే హేరంభుని దలచిన నా విఘ్నములును తొలగుట కొరకున్”

ప్రాచీన కాలం నుండీ నేటి వరకు ప్రతి పనికీ వినాయకుడి ననుసరించి ‘ఆదౌ నిర్విఘ్న పరిసమాస్థ్యర్థం గణపతి పూజాం కరిష్యే’ అని చెపుతూ విఘ్నాలను తొలగించమని కార్యసిద్ధి కోసం ‘ఆదౌ పూజ్యో గణాధిపః’ గణపతిని మొదటగా ఆరాధించడం జరుగుతుంది.వినాయకుడు ఆది అంతం లేని ఆనందమయ తత్త్వమూర్తి. అకుంఠిత దీక్షతో భక్తిప్రపత్తులతో కొలవాలేగాని, కోరిన కోరికలను సకల సౌభాగ్యాలను ప్రసాదించే సిద్ధి ప్రదుడు గణపతి. అన్ని శుభ కార్యాలకి ముందు గణపతి పూజ తప్పక ఉంటుంది.గణాధిపతి అయిన విఘ్నేశ్వరుడు బుద్ధిని ప్రసాదిస్తే, సిద్ధి ప్రాప్తిస్తుంది. భాద్రపద శుక్ల చవితినాడు వినాయకుడు ఆవిర్భవించాడు.

వినాయక చవితి రోజున విఘ్నేశ్వరుని, ఆకుపచ్చ రంగులో ఉన్న పత్రితో పూజ చేస్తే

సంతుష్టుడవుతాడు స్వామి.వినాయకునికి గరిక పూజ అంటే ప్రీతి.. వినాయక చవితినాడే గాక, ప్రతిరోజూ విఘ్నేశ్వరాలయాలలో, గరికతో స్వామిని అర్చిస్తారు.పూజాద్రవ్యములలో గరికను కూడా జత చేసి సమర్పిస్తారు భక్తులు. దీనికి జానపదుల కథ ఒకటి ఉంది. పార్వతీ పరమేశ్వరులు పాచికలాడుతున్నారు.న్యాయ నిర్ణేతగా నందీశ్వరుణ్ణి ఎంపిక చేశారు. ఈశ్వరుడే గెలిచాడని నంది తీర్పు చెప్పాడు.అయితే ఆ తరువాత అమ్మతో నిజం చెప్పాడు. ఈశ్వరుడు నాకు ప్రభువు. ఆయనే నా ప్రాణం. అందుకే ఆయన గెలిచినట్లు చెప్పాను. అయినా ఆయన అర్ధనారీశ్వరుడు గదమ్మా మీరిద్దరూ ఒకటే’ అన్నాడు.

నందీ! నీవు నయం కాని వ్యాధితో బాధపడతావు’ అని పార్వతి దేవి శపించింది..

నా తప్పును క్షమించమని ఆ తల్లి ని వేడుకొనగా నందీ నా కుమారుడైన గణనాథుని పుట్టిన రోజున నీకు ఇష్టమైన పదార్థాన్ని అర్పితం చెయ్యి. అతని అనుగ్రహంతో నీకు శాపవిమోచనం కలుగుతుంది అని సెలవిచ్చింది, పార్వతీదేవి. నంది తన కిష్టమైన గరికను గణపతికి అర్పించాడు. అతనికి శాపవిముక్తి లభించింది.. ఇది వినాయక పూజలో గరిక ప్రాధాన్యత .

దూర్వాయుగ్మం అంటే గరిక. అందుకే గణపతిని గరికతో అర్చిస్తే సర్వశుభాలను ప్రసాదిస్తాడు. ‘గ’ అంటే జ్ఞానము ‘జ’ అంటే పుట్టినది. గజమంటే జ్ఞానము వలన పుట్టిన మోక్షమని అర్థము.గజముఖము, గజానుని ముఖ దర్శనము శుభప్రదము, జ్ఞానప్రదము, మోక్షప్రదము విష్ణు సహస్ర నామములలో గణపతి: ఏకదంతుడు ఏకదం – అంతా ఒక్కటే. రెండవది లేదు అని అర్థం

విఘ్నేశ్వరుని చేతిలోని పాశ అంకుశాలు – రాగద్వేషాలను నియంత్రించే సాధనాలు. గణపతికి ప్రియమైన భక్ష్యం – మోదకం. ఆనందాన్నిచ్చేది. మోదకం ఆయన కృపాకటాక్షములలో ఆనందం లభిస్తుంది. మానవుడు క్రోధాన్ని విడిచి, అనురాగాన్ని అభివృద్ధి చేసికొని శాంతి సహజీవనంతో, సంపూర్ణ శరణాగతితో భగవంతుని యందు ప్రేమభావనా భక్తిని పెంపొందించుకొని, జీవితాన్ని చరితార్థత నొందించుకోవాలని సూచించే ఆయుధదారుడు విఘ్నేశ్వరుడు

మూషిక వాహనం : అంతరార్థం మూషికం (ఎలుక) వాసనామయ జంతువు.తినుబండారాల వాసననుబట్టి అది ఆ ప్రదేశానికి చేరుకుంటుంది. బోనులో చిక్కుకుంటుంది. ఆ విధంగానే మనిషి జన్మాంతర వాసనల వల్ల ఈ ప్రాకృతిక జీవితంలో చిక్కుకొని చెడు మార్గాలు పడతాడు. మూషిక వాహనుడుగా వాసనలను అనగా కోరికలను అణగద్రొక్కేవాడు వినాయకుడు.అంతేకాదు అహంకారానికి చిహ్నం – ఎలుక (మూషికం) అహంకారం బుద్ధిమంతుల్ని పతనం చేస్తుంది.బుద్ధికి అదిపతి అయిన మహాగణపతి దీనిని మలిచి జయించి సద్వినియోగం చేస్తాడు. మూషిక వాహనుడైన గణపతి సర్వాబిష్టాలు నెరవేరుస్తాడు.

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయత్ సర్వ విజ్ఞోప శాంతయే

అహంకారమును దరికి రానీయక భూతదయ కలిగి స్వార్థరహితంగా త్యాగబుద్ధితో, అమృతమైన మనస్సుతో సర్వమానవ సౌభ్రాతతతో విశ్వమానవ కళ్యాణాన్ని వీక్షించే వారి విఘ్నాలను నేను తొలగిస్తానని చెప్తున్నాడు మహాగణపతి.

గణపతి సాక్షాత్‌ పరబ్రహ్మ స్వరూపం.

గణం అంటే సమూహం. గణాలతో నిండి వున్న ఈ సమస్త విశ్వానికి అధిపతి గణపతి. అలాగే అహంకారానికి ప్రతీక అయిన ‘ఎలుక‘ను శాసించి వాహనంగా చేసుకున్న గణపతిని, మహా గణపతి, హరిద్రా గణపతి, స్వర్ణ గణపతి, ఉచ్చిష్ట గణపతి, సంతాన గణపతి, నవనీత గణపతి అని 6 రూపాల్లో పూజిస్తారు. నమస్తే గణపతయే… నీ ముందు అహంకార రహితమైన నా మనస్సును సమర్పిస్తున్నాను. హే గణపతీ జ్ఞానమూర్తివి, ఆనంద మయునివి నీవే. పరబ్రహ్మం, శాశ్వతమైన వానివి నీవేఅని వేడుకుంటేవిఘ్నేశ్వరుడు సకల విఘ్నాలను తొలగించడమే కాక విఘ్నాలకు కారణమైన వాటిని పోగొడతాడు. కార్యసిద్ధి కలిగించి తద్వారా సంతోషాన్ని కలిగించే పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. పాపాలు తొలిగితే మంచి బుద్ధి కలుగుతుంది. అశాశ్వతమైన వాటి మీద వైరాగ్యాన్ని కలిగించి భక్తిని కలిగిస్తాడు. భక్తి, జ్ఞానము, ద్వారా సిద్ధి, బుద్ధి కలుగుతుంది.

చవితి పండుగ

వినాయక చవితి పండుగనాడు ఉదయాన మంగళ స్నానములు (తలంటు) ఆచరించి, మట్టి విఘ్నేశ్వరుని పత్రి పుష్పములతో పూజించి విద్యార్థులు తమ పాఠ్యపుస్తకాలన్నిటినీ వినాయకుని ముందు పెట్టి, శ్రద్ధ్భాక్తులతో అర్చించి, సద్బుద్ధి కలగాలని మహాగణపతిని ప్రార్థిస్తూ పూజ చేస్తారు.. సర్వవిజ్ఞాలు తొలగాలని పెద్దలు మనసారా గణపతిని ప్రార్థిస్తారు… మన పండగలు.. వినాయకుడి పూజించే పత్రిలో ప్రధానంగా ఉండవలసినవి గరిక తులసి నేరేడు మారేడు మరువం ఉమ్మెత్త ఉత్తరేణి ఇవన్నీ కూడా ఎన్నో ఔషధ గుణాలున్న పత్రాలు. మన పండగలు అన్నీ కూడా సాంప్రదాయంతో కూడి ప్రకృతితో మమేకమైనవే.

సర్వేజనా సుఖినోభవంతు.

–బండారు జయశ్రీ

9885623485

Related News

Select the Topic
Scroll to Top