EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 1,50,000 Viewership

అంటువ్యాధులకట్టడి కోసం సమగ్రకార్యాచరణ   

నేటికీ మహమ్మారి కరోనా వైరస్ భూమండలాన్ని పట్టి పీడిస్తూనే ఉంది . ఇప్పటికే లక్షలాది మందిని బలిగొన్న కరోనా మహమ్మారి నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచానికి మంకీపాక్స్ రూపంలో మరో పెనుముప్పు ఎదురవుతోంది . ఇలా ఒక సూక్ష్మజీవి కారణంగా భూప్రపంచమంతట మరణామృదంగం మ్రోగటం మొదటిసారి కాదు . భూగోళం ఆవిర్భవించి సుమారు 470 కోట్ల సంవత్సరాలు కాగా భూమిపై తొలి జీవి ఉధ్భవించి 350 కోట్ల సంవత్సరాలు కావొస్తుంది . జీవపరిణామక్రమములో ప్రస్తుత బుద్ధిజీవుడైన మానవుడు సుమారు 40 వేల సంవత్సరాలనుండి ప్రకృతితోసహజీవనం చేస్తూ జీవిస్తున్నాడు . కానీ నేటి అత్యాధునిక నానో డిజిటల్ యుగంలో ప్రకృతి సాన్నిహిత్యాన్నిమరిచి శాస్త్రసాంకేతిక పరిశోధనలతోసరికొత్త విధ్వంసక ఆవిష్కరణలతో వర్చువల్ లోకంలో విహారిస్తున్నాడు . ఈ క్రమంలో జీవకోటిచరిత్రలో రకరకాల సూక్ష్మజీవులు ముఖ్యంగా బాక్టీరీయాలు వైరస్ లు పుట్టి పలురకాల వ్యాధులకు కారణమై లక్షల సంఖ్యలో జంతువులను మనుషులను బలిగొంటున్నందున భూగోళంపై మానవుని మనుగడ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది . ఈ నేపధ్యంలో అంటువ్యాధుల నివారణ కోసం సంసిద్దత ప్రతిస్పందన నిర్వహణ మరియు భాగస్వామ్యం యొక్క ప్రాముఖ్యతలను సూచించడానికి ప్రపంచ దేశాలన్నీ ప్రతి ఏడాది డిసెంబర్ 27 నఅంతర్జాతీయ అంటువ్యాధుల సంసిద్దత దినోత్సవం ( ఇంటర్నేషనల్ ఎపిడెమిక్ ప్రిపేర్డ్ నెస్ డే ) ను జరుపుకోవాలని నవంబర్ 2020 లో ఐక్యరాజ్యసమితి జనరల్అసెంబ్లీ తీర్మానించింది . ఈ ఏడు 2024 డిసెంబర్ 27 న “ అన్ని స్థాయిలలో అంటువ్యాధులపై ప్రజలకు అన్ని స్థాయిలలో అవగాహన కల్పించడం మరియు భవిష్యత్తులో కలిగే అంటువ్యాధుల వ్యాప్తికి సిద్దం చేయడం “ అనే ఇతివృత్తంతో ఐదవ అంతర్జాతీయ అంటువ్యాధుల సంసిద్దతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము . పర్యావరణవ్యవస్థల విధ్వంసం అసాధారణ వాతావరణ మార్పులు అక్రమవన్యప్రాణుల వ్యాపారం , సాధుజంతువుల పెంపకాలలో అవలక్షణాలు , మానవాళి అనాలోచిత జీవనశైలి అంటువ్యాధులు రెచ్చిపోవడానికి కారణమవుతున్నాయి . మానవుని ప్రకృతి విరుద్దమైన విపరీత చర్యల వల్ల ప్లేగు మశూచి కరోనా లాంటి అంటువ్యాధులు మహామ్మారి మహావిపత్తులుగా మారి కోట్లాది మనుషులను జంతువులను కబలించినట్లు చరిత్ర చెబుతోంది .

అంటువ్యాధుల ప్రభంజనం : ఆదిమసమాజంలో మానవుడు తనకు కలిగే రోగాల నివారణకు ప్రకృతి శక్తులను , గ్రామదేవతలను సింబాలిక్ గా భావించి పూజించేవాడు . చెట్ల ప్రక్రియలను ఉపయోగించేవాడు . విష క్రిముల గురించి మరియు 26 రకాల రోగాల నివారణోపాయల సమాచారం నాటి అధర్వణవేదంలో ప్రస్తావించబడటం గమనార్హం . అయితే చాలా కాలం వరకు వ్యాధులకు సంబంధించిన శాస్త్రీయ పరిజ్ఞానము మానవులకు తెలియదు . క్రీ .శ. 1672 లో డచ్ శాస్త్రవేత్త ఆంటోనివాన్ లూవెన్ హక్ బాక్టీరియాలను , 1892 లో రష్యా శాస్త్రవేత్త డిమిట్రి ఇవనోవ్ స్కీ వైరస్ లను కనుగొన్న అనంతరమే సూక్ష్మజీవుల గురించి శాస్త్రీయ సమాచారము మరియు అవి కలిగించే వ్యాధుల గురించి ప్రపంచానికి తెలిసింది . సాధారణంగా ఒక పరిమిత ప్రాంతానికి లేదా కమ్యూనిటికి పరిమితమయ్యే అంటువ్యాధిని ఎపిడెమిక్ అని , ఖండాంతర సరిహద్దులు దాటి వ్యాపించే వ్యాధిని మహమ్మారి ( పాండమిక్ ) అని పిలుస్తారు . బాక్టీరియాలు వైరస్ లు జన్యుమ్యుటేషన్ కు లోనై ఏర్పడే వివిధ హానికర వేరియంట్స్ మహమ్మారి వ్యాధులుగా మానవులపై విరుచుకపడి లక్షలాది మందిని బలిగొన్న సంఘటనలు చరిత్రలో చాలా ఉన్నాయి . బాక్టీరియాల వల్ల కలిగే ప్లేగువ్యాధి ( బ్లాక్ డెత్ వ్యాధి ) ఇప్పటివరకు ఐదుసార్లు మానవజాతిని అతలాకుతలం చేసింది . 5వ శతాబ్దంలో వచ్చిన జస్టీనియన్ ప్లేగు వల్ల ఐరోపా ఆసియా ఉత్తర అమెరికా అరేబియా దేశాల్లో సుమారు మూడుకోట్ల మంది , 1347 లో వచ్చిన బుబోనిక్ ప్లేగు వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోగా , 1665 లో కలిగిన దీ గ్రేట్ ప్లేగ్ ఆఫ్ లండన్ వల్ల 75 వేల మంది బలైనారు . క్రీ .శ 1817 లో బాక్టీరియాల వల్ల ప్రారంభమైన కలరా ( బ్లూ డెత్ వ్యాధి ) కారణంగా రెండు లక్షల మందికి పైగా చనిపోయారని అంచనా . అదే విధంగా 15 వ శతాబ్ధంలో వైరస్ వల్ల పుట్టి ఐరోపా ఆసియా అరేబియా దేశాల్లో విస్తరించిన మశూచి ( స్మాల్ పాక్స్ ) లేదా గత్తరరోగం వల్ల సుమారు 20 లక్షల మంది చనిపోయారు . బ్రిటీష్ డాక్టర్ ఎడ్వర్డ్ జెన్నర్ టీకామందును కనుగొనడంతో భూమండలం నుండి మశూచి పూర్తిగా తొలగిపోయినట్లు 1980లో ప్రపంచఆరోగ్యసంస్థ ప్రకటించింది . క్రీ.శ 1918 లో వైరస్ కారణంగా మొదలైన స్పానిష్ ఫ్లూ మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 కోట్ల మంది బలి అయినారని గణాంకాలు చెబుతున్నాయి . నాటి నుండి నేటి వరకు వైరస్ లు తమ జెనెటిక్ కోడ్ ను మార్చుకుంటూ రేబిస్ ఆంత్రాక్స్ ఎయిడ్స్ డెంగ్యూ స్వైన్ ఫ్లూ బర్డ్ ఫ్లూ , చికెన్ గున్యా ఎబోలా జికా హంటా , మెర్స్ మరియు సార్స్ అను రకరకాలైన వైరస్ లుగా రూపాంతరం చెంది లక్షలాది మందిని బలిగొన్న విషయం విదితమే . ప్రస్తుతం అత్యంత త్వరితగతిన మ్యూటేషన్ చెందుతూ పలు రకాలైన వెరియంట్స్ గా విస్తరిస్తున్న సార్స్ కరోనా వైరస్-2 వల్ల కలిగే కోవిడ్ -19 మహమ్మారి వల్ల ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా 70 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి . మన దేశంలో సుమారు 5.33 లక్షల మంది చనిపోయారు . కోవిడ్ -19 సీజనల్ వ్యాధిగా మరనున్నదని కానీ పర్యావరణంలో సానుకూలమార్పులు చోటు చేసుకోకపోతే అతిత్వరలో మరో ప్రాణాంతక వైరస్ వల్ల కలిగే డిసీజ్- ఎక్స్ ప్రపంచవ్యాప్తంగా కనీసం ఐదుకోట్ల మందిని కబళించే అవకాశాలున్నాయని డబ్ల్యుహెచ్ఓ ఇటీవల హెచ్చరించింది . మరో పదిఏండ్లలో కోవిడ్ -19 లాంటి మరో భీకరమైన వైరస్ పంజా విసిరే అవకాశాలున్నాయని లండన్ కు చెందిన ప్రిడిక్టివ్ హెల్త్ ఇంటలిజెన్స్ డేటా అనలిటిక్స్ సంస్థ ఎయిర్ ఫినిటి-2023 లో తన నివేదికలో తెలిపిన విషయం గమనించాలి . కనుక భవిష్యత్ లో కలిగే అంటువ్యాధులను మహామ్మారి వ్యాధులను ఎదుర్కొనేందుకు వన్ హెల్త్ అప్రోచ్ అమలుతో పాటు వ్యూహాత్మక సంసిద్దతా ప్రణాళికలు అత్యంత అవశ్యకమైనవిగా గుర్తించాలి .

వన్ హెల్త్ విధానం అవశ్యం : అంటువ్యాధిసంసిద్దత అనేది వ్యాధి వ్యాప్తికి సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండడానికి జాతీయస్థాయి నుండి స్థానిక ఆరోగ్య సౌకర్యాల స్థాయిల వరకు చేపట్టవలసిన అన్ని కార్యకలాపాల సమ్మిళితం . అందుకు ఒకే ఆరోగ్యం ( వన్ హెల్త్ ) విధానం అమలు ఎంతో అవశ్యం . వన్ హెల్త్ అనేది ఆరోగ్యం ఉత్పాదకత మరియు పరిరక్షణ సవాళ్ళను పరిష్కరించడానికి వివిధ రంగాలను ఒకచోట చేర్చే ఒక సమగ్ర ఆలోచన . ప్రజలు జంతువులు మొక్కలు మరియు అన్ని పర్యావరణ వ్యవస్థల ఆరోగ్యాన్ని సమతుల్యం చేయడం మరియు ఆప్టిమైజ్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్న సమగ్రమైన ఏకీకృత విధానమునే వన్ హెల్త్ గా సూచిస్తారు . మానవులకు వ్యాపించే అంటువ్యాధులు సుమారు 60-75శాతం జంతువుల నుండే సంక్రమిస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు . కనుక వన్ వరల్డ్ – వన్ హెల్త్ చొరవలో భాగంగా మన దేశంలో నేషనల్ వన్ హెల్త్ మిషన్ ను ఏర్పాటు చేసి జూనోటిక్ మరియు అంత్రపోజూనోటిక్ వ్యాధుల నియంత్రణకు కృషి సల్పుతున్నది . ఈ విధానం పరిశుభ్రమైన నీరు శక్తి గాలి సురక్షితమైన పోషకాహారం వంటి సామూహిక అవసరాలను పరిష్కరిస్తుంది . తద్వారా ఆరోగ్యం మరియు పర్యావరణ వ్యవస్థల ముప్పులను అధిగమించి , వాక్సిన్తయారితో కోవిడ్ నియంత్రణలో మనదేశం ఎంతో ముందున్నది . మానవుడు మహమ్మారి యుగం నుండి తప్పించుకోవడం సాధ్యమేనని , అయితే ప్రతిచర్యల నివారణవిధానంలో భూకంపమార్పులు తప్పనిసరి అని నిపుణులు తెలియజేస్తున్నారు .

కోవిడ్-19 వెలుగులో అంటువ్యాధులనుండి ప్రపంచాన్ని రక్షించడానికి సంసిద్దత నివారణ ప్రతిస్పందన నిర్వహణ రంగాలలో ఇతోధికమైన పెట్టుబడులు పెట్టడానికి అన్ని దేశాలు ముందుకు రావాలి . సాంకేతికత ఆర్థిక సంపన్నత కలిగిన దేశాలు 100 రోజుల్లో వాక్సిన్ అభివృద్దికి ముందస్తు సంసిద్దతా కార్యాచరణ కలిగి ఉండాలి . మానవ మరియు జంతు ఆరోగ్యసంస్థల మద్య సమాచార భాగస్వామ్యాన్ని పెంపొందించాలి . ఇప్పటికే ఉన్న జంతువుల ఆరోగ్యం మరియు వ్యాధి నిఘావ్యవస్థలను ఏకీకృతం చేయాలి . గ్రామస్థాయి వరకుహెల్త్ మిషన్ ను ఏర్పాటుచేసి ప్రతి దశలో ఒకే ఆరోగ్యంను అమలు చేయడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి సార్వత్రిక ఆరోగ్యకవరేజిని మెరుగుపరచాలి . అంటువ్యాధులంటే కలిగే భయం మరియు కళంకంలను తొలగించేందుకు మానవప్రవర్తనలో మార్పుకు కృషి జరగాలి . కోవిడ్ -19 ను తదుపరి కలిగే ప్రపంచ ఆరోగ్య విపత్తుకు వేక్ అప్ కాల్ గా భావించి అంతర్జాతీయ సమైక్య సహకారంతో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ప్రకృతి పరిరక్షణలో మరియు అత్యాధునిక సాంకేతికతల వినియోగంలోనూ విజ్ఞత వివేకము విచక్షణలను పాటించినప్పుడే మనం భూమిపై అంటువ్యాధులను కట్టడి చేయగలుగుతాము .

వ్యాసరచయిత : డాక్టర్ భారత రవీందర్

గెజిటెడ్ హెడ్మాస్టర్ & పర్యావరణ నిపుణులు

( సెల్ 9912536316 )

 

 

Related News

Select the Topic
Scroll to Top