EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 1,50,000 Viewership

ఈదుల్ ఫిత్ర్ – దానాల పండుగ

11.4.2024 రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల ఖమ్మం, ఈతరం భారతం.

“దానాల పండుగ” వినటానికి విచిత్రంగా ఉంది కదూ! అవును ‘రంజాన్ పండుగ’ అంటే ముస్లిములు ఉపవాసాలు ఉండే నెల, సేమియాలు, బిర్యానీ పంచే పండుగ వగైరా… అని మాత్రమే చాలా మంది అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి ‘రంజాన్ పండుగ’ అసలు పేరు “ఈదుల్ ఫిత్ర్” అని, అంటే- “దానాల పండుగ” అన్న విషయం ముస్లిమేతర సోదరుల్లో అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన విషయం.రంజాన్ అనేది కేవలం పన్నెండు నెలల్లో ఒక నెల పేరు మాత్రమే. వాస్తవానికి రంజాన్ నెల మొత్తం ఉపవాసాలు ఉండి, షవ్వాల్ నెల మొదటి రోజు పండుగ చేసుకోటాన్ని బట్టి “రంజాన్ పండుగ” అని సర్వసాధారణంగా పిలుస్తుంటారు. తప్పితే ఈ పండుగ అసలు పేరు “ఈదుల్ ఫితర్” అంటే- “దానాల పండుగ” అని అర్థం.

ఒక రకంగా ఈ “ఈదుల్ ఫితర్” పండుగ రోజును సామాన్య పరిభాషలో “ఛారిటీ డే ” అని చెప్పాల్సి ఉంటుంది!దానాలను చెయ్యటాన్ని కూడా పండుగలా సెలబ్రేట్ చేసుకునే ఒక రోజుంటుందా? అన్నది ఆలోచిస్తేనే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఇస్లాం, ముస్లిం సమాజానికి మీ కుటుంబంలో, ఇరుగు పొరుగున ఉండే బీదలను కలుపుకుని వారికి దానమిచ్చి పండుగ చేసుకునే విధానం నిర్దేశిస్తుంది. తమ ఆత్మ గౌరవం కొద్దీ కొందరు నోరు తెరచి ఆర్థిక స్తోమత గురించి తమ అవసరాల గురించి చెప్పలేరు. అలాంటి వారిని సైతం కనిపెట్టి దానం చెయ్యమని ఇస్లాం చెబుతుంది.అటు భయభక్తులు, నైతిక విలువలతో పాటు ఇటు బీదసాదల, అవసరార్ధుల, అన్నార్తుల హక్కును పటిష్టంగా నెరవేర్చటానికి, దానం విధిగా చెయ్యటాన్ని ఆచరణాత్మకం గా నేర్పటానికి నిర్దేశించబడిన నెలే “రంజాన్”. ఈ నెలంతా ఉపవాసాలు ఉండి ముస్లిం సమాజం “ఈదుల్ ఫితర్ (దానాల పండుగ)” చేసుకునే ఓ ఉన్నత విధానం ఇస్లాం నిర్దేశిస్తుంది.

ఇస్లాం నిర్దేశించే రెండే రెండు పండుగల్లో ఒకటి “ఈదుల్ ఫిత్ర్” అన్నది దానాలు చెయ్యటాన్ని నేర్పే నెల అయితే దీని తరువాత వచ్చే మరో పండుగ “ఈదుల్ – అద్ హా ” అంటే “త్యాగాల పండుగ” అని అర్థం దీనినే “బక్రీద్” అంటారు.

ఈ విధంగా ఇస్లాం చివరకు ఆనందంగా జరుపుకునే పండుగలను సైతం వ్యక్తిత్వ నిర్మాణం ప్రాతిపదికన, బీదసాదల అవసరాలను తీర్చే విధంగా ముస్లిం సమాజానికి నిర్దేశిస్తుందన్న విషయం చాలా మంది ఇస్లాం విమర్శకులకు తెలీనే తెలియదు.ఈ విధానం నిర్దేశించటం వెనుక కారణం పండుగ సంతోషాన్ని కేవలం సంపాదనాపరులే కాక స్థోమత లేని నిరుపేదలను సైతం తమ సంతోషంలో భాగస్వాములు చెయ్యటం, వారి అవసరాలను తీర్చటమే.దానం విషయంలో చివరకు ఒక ఖర్జూరమైనా దానం చేసి మీరు నరకాగ్ని నుండి రక్షించుకోమని ప్రవక్త ముహమ్మద్ (స) సెలవిచ్చారు. అలాగే స్వయంగా ప్రవక్త ముహమ్మద్ (స) – పొరుగువాడు ఆకలిగా ఉండగా తాను మాత్రం కడుపునిండా తినేవాడు అసలు విశ్వాసే కాదన్నారు.ఏదైనా దానం చెయ్యమని ప్రవక్త ముహమ్మద్(స) ఇంటికి వస్తే ఇంట్లో ఏమీ లేనప్పటికీ ఇంట్లో ఒకటో రెండో ఖర్జూరాలు ఉంటే చివరకు వాటిని సైతం దానం చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. దీనిని బట్టి ఇస్లాం దానానికి ఎంత గొప్ప ప్రాముఖ్యత ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు.రంజాన్ నెలలో ప్రతీ ఒక్కరూ “ఫిత్రా (దానం)” మాత్రమే కాక ఆస్తి పరులకు “జకాత్” సైతం ఇవ్వమనే ఆజ్ఞను సైతం ఖురాన్ ఇస్తుంది. ఖురాన్ లో నమాజ్ (ప్రార్ధన) చెయ్యమనే ఆజ్ఞ ఇవ్వబడినప్పుడల్లా దానితో పాటే “జకాత్” సైతం ఇవ్వమనే ఆజ్ఞను కొన్ని వందల సార్లు చూడగలం. “జకాత్” అన్నది ఆస్తిపాస్తులు, భూములు, డబ్బు బంగారం కలిగి ఉన్నవారు వాటిపై కొంత శాతాన్ని తీసి బీదసాదలు, అగత్యపరులకు పంచాల్సిన దానం అని అర్థం.

“దానాల పండుగ” రోజు “చెయ్యాల్సింది”

దానలు విస్తృతంగా చెయ్యటమే! మన సంతోషంలో బీదసాదలకు భాగస్వాములు చెయ్యాలి. అందుకోసమే ఈ “ఈదుల్ ఫితర్” పండుగ నిర్దేశించబడింది. అలాగని పండుగ రోజు కొత్త బట్టలు, హంగూ ఆర్భాటాలు అవసరంలేదా? అంటే అవకాశం ఉనోల్లు ఇంటిల్లిపాదీ కొత్తబట్టలు కొని ధరించటంలో తప్పులేదు, కానీ అది రూల్ కూడా కాదు, సెంటిమెంటుగా అప్పు చేసి మరీ కొనాల్సిన పని అస్సలు లేదు. ఉన్న దాంట్లోనే మంచి బట్టలు ధరించి పండుగ చేసుకోవటం ప్రవక్త సాంప్రదాయం కూడా. కానీ, అత్యధికంగా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అంశం మటుకు కేవలం ఉన్నంతలో ఎక్కువగా దానాలు చెయ్యటమే! అప్పుడే “దానాల పండుగ” అసలు ఉద్దేశం నెరవేరేది కూడా.అంతేకాక, ముస్లిములు తమ ఇరుగుపొరుగున ఉండే ముస్లిమేతరులతో తమ పండుగ సంతోషాన్ని పంచుకోవాలి. తాము వండుకునే వంటలను వారికి సైతం పంచుతూ చక్కటి ఐక్యతతో కూడిన వాతావరణాన్ని పెంపొందించాలి. అవకాశం ఉంటే వారికి “ఈదుల్ ఫిత్ర్” అసలు ఉద్దేశం ఏమిటో వివరించాలి.ఇక చివరిగా, దానం గురించి ప్రవక్త ముహమ్మద్ (స) చెప్పిన గొప్ప విషయం…

“దానం వలన మీ సంపద ఏ మాత్రం తగ్గిపోదు” – (సహీహ్ ముస్లిం 2588)

Related News

Select the Topic
Scroll to Top