EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 1,50,000 Viewership

క్యాన్సర్ పై ప్రజల్లో పెరిగిన అప్రమత్తత – డాక్టర్ లిల్లీ మేరి  

తెలుగు రాష్ట్రాలలో క్యాన్సర్ కు సంబంధించిన ముందస్తు పరీక్షలు చేయించుకుంటున్న వారి సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరిగింది. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను గతంలో తేలిగ్గా తీసుకున్న వారు కూడా ఇప్పుడు ఎందుకైనా మంచిదని ఉద్దేశంతో ముందస్తు పరీక్షలు చేయించుకుంటున్నారు. క్యాన్సర్ పై ప్రజలు అప్రమత్తమవుతున్నారు అని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ లిల్లీ మేరి తెలిపారు.

ప్లేగు, కలరా, మసూచి మానవాళి మనుగడ క్రమంలో వేరువేరు దశలలో ప్రజలను గడగడ వణికించిన జబ్బులివి. ఇప్పుడు ఆ స్థానాన్ని క్యాన్సర్ ఆక్రమించింది. రాచపుండు పేరుతో ఒకప్పుడు ఉన్నత వర్గాల వారికి మాత్రమే పరిమితమైన క్యాన్సర్ ఇప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ కబలిస్తుంది. తాగే నీరు, తిని తిండి, వాడే వస్తువులు, జీవనశైలి కారణాలు ఏమైనా గాని క్యాన్సర్ కేసుల సంఖ్య నానాటికి విస్తృతంగా పెరిగిపోతుంది. నిజానికి క్యాన్సర్ ఆరంభంలో గుర్తిస్తే తగ్గించే అవకాశం ఉంటుంది. కానీ, క్యాన్సర్ ఇచ్చే సూచనలను గుర్తించకుండా నిర్లక్ష్యం వహించడం వల్ల అది ముదిరి చివరకు ప్రాణాంతకం అవుతుంది. 30 సంవత్సరాల దాటిన మహిళలు, పురుషులకు ఇప్పుడు పలు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ఇన్నాళ్లు వాటిని ఎవరు పట్టించుకునే వారు కాదు. కానీ, ఇటీవల కాలంలో పలువురు సెలబ్రిటీలు క్యాన్సర్ బారిన పడిన సంఘటనలు వెలుగులోకి వస్తుండడంతో ప్రజలు కూడా స్క్రీనింగ్ పరీక్షలపై దృష్టి సారిస్తున్నారు. దీంతో కొన్ని ఆస్పత్రులలో ప్రత్యేక ప్యాకేజీలో ఆ పరీక్షలను కూడా జత కలుపుతున్నారు. ముఖ్యంగా హెల్త్ ప్యాకేజీల్లో మహిళల కోసం ప్రత్యేకంగా గర్భాశయ రొమ్ము పరీక్షలు, అల్ట్రా సౌండ్ పరీక్షలను క్యాన్సర్ నిర్ధారణ కోసం చేస్తున్నారు. ఇక కార్పొరేట్ క్యాన్సర్ ఆసుపత్రులలో అయితే కేవలం క్యాన్సర్ ప్రత్యేక ప్యాకేజీలను ప్రవేశపెడుతున్నారు అని లిల్లీ మేరి తెలిపారు.

మొదట్లో గుర్తిస్తే…

చాలామందిలో క్యాన్సర్ లక్షణాలు కనిపించినప్పటికీ పెద్దగా పట్టించుకోవడం లేదు. దీనితో మూడవ దశ, నాలుగో దశలో వైద్యులకు సంప్రదిస్తున్నారు. అప్పటికే పరిస్థితి విషమిస్తుంది. క్యాన్సర్ ను మొదటి, రెండో దశలో గుర్తిస్తే పూర్తి కాలం జీవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రాథమిక దశలో చికిత్స చేయించుకుంటే 80 శాతం, రెండవ దశలో 70%, మూడో దశలో 40%, 4వ దశలో 20శాతం బతికే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు.

క్యాన్సర్ పై నాలుగు విధాల యుద్ధం:

నాలుగు రకాల అస్త్రాలతో క్యాన్సర్ పై విజయం సాధించవచ్చని లిల్లీ మేరి చెప్తున్నారు. అది ఏమిటంటే టీకాలు, ముందు పరీక్షలు, జీవనశైలి మార్పులు, కీమో ప్రివెన్షన్ ఉదాహరణకు హ్యూమన్ పాపిలోమా వైరస్ గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ ను నిరోధించవచ్చు. అలాగే ముందస్తు పరీక్ష ద్వారా క్యాన్సర్ ను తొలిదశలోనే గుర్తించవచ్చు. జీవనశైలి మార్పులు అంటే పొగాకు వినియోగం, మధ్యపానం, ధూమపానము వంటి క్యాన్సర్ కారక అలవాటులను మానుకోవటం. కీమో ప్రివెన్షన్ అంటే కొన్ని రకాల మందులను వాడటం ద్వారా క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడటం. ఒక్కసారి క్యాన్సర్ వచ్చి తగ్గిన వారికి కూడా వైద్యులు ఈ మందులు ఇస్తారు అని సహాయ ఆచార్యులు డాక్టర్ లిల్లీ మేరి పేర్కొన్నారు.

క్యాన్సర్… ముందస్తు హెచ్చరికలు:

శరీరంలోని ఆరోగ్యవంతమైన కణాలు మార్పిడి చెందుతూ, అసాధారణంగా పెరిగిపోవడంతో క్యాన్సర్ మొదలవుతుంది. ఈ ప్రక్రియ జరగడానికి చాలా కాలం పడుతుంది. ఈ సమయంలో మన శరీరం పలు హెచ్చరికలు జారీ చేస్తుంది. అందులో కొన్ని కారణం లేకుండా బరువు తగ్గిపోవడం, ఆకలి మందగించడం, కారణం లేకుండా తరచుగా జ్వరం రావడం, విపరీతమైన అలసట, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్న భాగంలో విపరీతమైన నొప్పి పదేపదే వస్తుంటుంది. చర్మ క్యాన్సర్ అయితే చర్మం నల్లగా మారటం, దురద, ఎర్రగా రావడం, పుట్టుమచ్చల పరిమాణాల్లో మార్పులు. జీర్ణాశయ క్యాన్సర్ అయితే జీర్ణా వ్యవస్థ దెబ్బతింటుంది. కారణం లేకుండా నాలుకపై తెల్లటి ముచ్చలు వస్తాయి. దీర్ఘకాలంగా ఎడతెగని దగ్గు, గొంతు బొంగురు పోవడం వంటివి. ఎక్కువకాలం శరీరంపై పండ్లు ఉంటే నోటిలో తరచూ పుండ్లు వస్తుంటే, అకారణంగా ముక్కు, నోటి ద్వారా రక్తస్రావం జరుగుతుంటే, మలమూత్రములో రక్తం పడుతుంటే, రొమ్ములో ఎక్కడైనా నొప్పిలేని గడ్డలు ఉంటే, చంకలు, గజ్జల్లో గ్రంధులు వాపుగా ఉంటే ఇవి క్యాన్సర్ కు ముందస్తు హెచ్చరికలు అని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ లిల్లీ మేరి తెలిపారు.

ఈ జాగ్రత్తలు అవసరం:

మన జీవనశైలిలో చేసుకునే చిన్న చిన్న మార్పుల ద్వారా పలు రకాల క్యాన్సర్లు రాకుండా నిరోధించవచ్చు, అవి ఏమిటంటే పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల 90% ఓరల్ క్యాన్సర్లు వస్తాయి కాబట్టి పొగాకు, ధూమపానం, మద్యపానము మానివేయాలి. పంపుల్లో వచ్చే నీటిలో రకరకాల కార్సినోజెన్లు, హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసే రసాయనాలు ఉంటాయి కాబట్టి అలాంటి నీటిని యధాతరంగా తాగకుండా కాచిచల్లార్చి వడపోసి తాగాలి. హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్ పి వి) వ్యాక్సిన్ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ను పలు రకాల ఇతర క్యాన్సర్లను నిరోధిస్తుంది. నీళ్లు ఎక్కువగా తాగుతుంటే, యూరిన్లో పేరుకు పోయే క్యాన్సర్ కారక ఏజెంట్లను ఆ నీరు ఎప్పటికప్పుడు బయటకు తోసేస్తుంది. దీనివల్ల మూత్రకోస క్యాన్సర్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. జంక్ ఫుడ్ కు దూరంగా ఉంటూ పండ్లు, కూరగాయలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం తింటూ, నిత్య వ్యాయామం చేసే వారికి క్యాన్సర్ ముప్పు చాలా తక్కువ. మైక్రో న్యూట్రీషియన్లు ఎక్కువగా ఉండే ఆకుపచ్చని కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ప్లాస్టిక్ విస్తర్లు, కప్పులు, ప్లేట్లలో వేడివేడి ఆహార పదార్థాలు పెట్టుకుని తినడం మానేయాలి. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల జోలికి వెళ్లకపోవడం మంచిది. ఫ్రిజ్లో నిల్వ ఉంచిన ఆహారం తినవద్దని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ లిల్లీ మేరి పేర్కొన్నారు.

 

Related News

Select the Topic
Scroll to Top